వైసీపీలో రివోల్ట్.. జగన్ పట్టు జారిందా? | revolt in ycp| jagan| lost| command| party| sittings| change| decision
posted on Dec 14, 2023 9:53AM
అహంకారం, అహంభావం, మితిమీరిన పెత్తనం వైసీపీలో ఎవరికీ ఊపిరాడకుండా చేస్తోందా. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా? ఇంకెంత మాత్రం అహంకారాన్నీ, అహంభావాన్ని, పెత్తనాన్నీ భరించేది లేదంటూ వైసీపీ నేతలు తిరుగుబాటుకు రెడీ అయిపోతున్నారా? అంటే జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే పార్టీకీ, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఇప్పుడు జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన మోపిదేవి వెంకటరమణ కూడా ఆత్మీయ సమ్మేళనాలు, వెంకన్న దర్శనాల తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారంటూ వస్తున్న వార్తలు కూడా వైసీపీలో ఇక ఎంత మాత్రం జగన్ ఆధిపత్యాన్ని అంగీకరించి, ఆమోదించి ఆయన అడుగులకు మడుగులొత్తే పరిస్థితి లేదని తేల్చేస్తున్నాయని అంటున్నారు.
జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి సిట్టింగులను మార్చేస్తే సరిపోతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలకు ఇప్పుడు తిరుగుబాటు భయం పట్టుకుంది. అసలు ప్రజా వ్యతిరేకత ఉన్నది జగన్ పైనేననీ, ప్రజలంతా జగన్ ను వ్యతిరేకిస్తుంటే.. ఆయన మాత్రం తమ రాజకీయ భవిష్యత్ ను ఫణంగా పెట్టి సేఫ్ అవుదామని చూస్తున్నారనీ పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో విస్పష్టంగా చెబుతున్నారు. దాదాపు 90 నియోజకవర్గాలలో సిట్టింగులను మార్చాలన్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పార్టీలో పెద్ద కుదుపునకు దారి తీసింది. ఇంత కాలం అవమానాలను మౌనంగా భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇక తమ వల్ల కాదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సరిగ్గా ఇదే రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మొత్తం మార్చేసే పరిస్థితికి దారి తీసింది. సొంత ఆలోచన అంటూ లేని జగన్ తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ప్రజా వ్యతిరేకత అంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే అన్న నిర్ణయానికి వచ్చేసి, వారిని మార్చేస్తే మనం సేఫే అన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.
అందుకే దాదాపు 90 నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తే సరిపోతుందని భావించి ఆ దిశగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అయితే జగన్ నిర్ణయం మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. పార్టీలో ఒక్క సారిగా అసమ్మతి భగ్గుమంటున్నది. నిన్న మొన్నటి దాకా జగన్ మీద ఈగ వాలితే సహించలేమన్నట్లుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు వారే జగన్ ను ధిక్కరిస్తున్నారు? పార్టీని వదిలేయడానికి కూడా వెనుకాడటం లేదు.
జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, ఇప్పుడు మోపిదేవి అసమ్మతి రాగం ఆలపించడం, అలాగే సమీప బంధువు బాలినేని తనకు తానే ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించేసుకోవడం ఇవన్నీ జగన్ కు పార్టీపై పట్టు సడలిందన్నడానికి నిదర్శనాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పనిలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తమ్ముడిని మంత్రిని చేస్తానని, స్వయంగా జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబుపై కేసులు వేయించడంలో ఆళ్లను ప్రోత్సహించారు. అటువంటి ఆళ్లకు దక్కిన మర్యాద పార్టీలోని ఇతరులను కూడా ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికలకు ముందు దాదాపు 90 మంది సిట్టింగులను మార్చాలని నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా ఇన్చార్జిలను మార్చిన చోట్ల ఇప్పటికే అసమ్మతి అగ్గి రాజుకుంది. మొత్తంగా వైసీపీలో ఇక అసమ్మతి, అసంతృప్తి దాపరికం లేకుండా బహిర్గతమయ్యాయి. ముందు ముందు ఇవి మరింత ఎక్కువగా పార్టీని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.