ముందు నుయ్యి, వెనుక గొయ్యి.. అయోమయంలో జగన్! | ap assembly elections jagan confused| defeat| confirm| sittings
posted on Dec 15, 2023 11:07AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నిండా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి అది వేరే విషయం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమాయత్తమౌతున్న తీరు చూస్తే ఆయనలో విజయం పట్ల ఏ మాత్రం విశ్వాసం లేదని అవగతమౌతున్నది. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన జగన్.. అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే పార్టీ అధినేతగా గానీ, ప్రభుత్వాధినేతగా కానీ ఏ విషయంలోనూ జగన్ ఇప్పటి దాకా బాధ్యత తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసిన అధికారులకు కోర్టుల్లో అక్షింతలు, మందలింపులు, శిక్షలే ఇందుకు నిదర్శనం. ఇక ముందు జగన్ తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తారన్న నమ్మకం కూడా ఎవరిలోనూ, ఆఖరికి పార్టీ శ్రేణుల్లో కూడా లేదు. అందుకు తగ్గట్టుగానే పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యేలపై నెట్టేందుకు జగన్ నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పు నిర్ణయమే నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఆ ఓటమికి తాను కాదు, ఎమ్మెల్యేల పనితీరే కారణమని ప్రజలను నమ్మించడానికి నానా కష్టాలూ పడుతున్నారు. ఇంత కాలం తనకు అత్యంత విధేయులుగా ఉన్న వారిని కూడా బలిపశువులు చేసి రానున్న ఓటమి నెపం వారి మీదకు నెట్టేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
గతం నుంచీ కూడా ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం పార్టీనీ, క్యాడర్ నూ జనంలో తన పట్ల సదభిప్రాయమే ఉంది, కానీ ఎమ్మెల్యేల పనితీరు వల్లనే పార్టీ నష్టపోతోందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి వారిని పని చేయనీకుండా చేసింది కూడా జగన్ విధానాలే. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఎటువంటి పనీ లేకుండా చేసి మొత్తం తాను నమ్ముకున్న వాలంటీర్లకే పెత్తనం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ప్రభుత్వం పేరు చెప్పుకుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకోవడానికే పరిమితమయ్యారన్న విమర్శలు ఎదురయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వారి ప్రమేయం ఏమాత్రం లేకపోవడంతో వారు జనాలకు దూరమయ్యారు.
ఎమ్మెల్యేలతో పనేముంది.. బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నాను కనుక తన ముఖం చూసే జనం ఓటేస్తారన్న భ్రమల్లో ఉన్న జగన్ పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తత్వం బోధపడి.. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రారంభించిన ఈ చర్యలను కూడా ఆయన తనను బ్లేమ్ నుంచి తప్పించుకుంటే చాలు, పార్టీ ఏమైపోయినా ఫరవాలేదన్నట్లుగానే చేపట్టారు.
తెలంగాణలో ప్రజా వ్యతిరేకత సిట్టింగుల మీద ఉందన్న సంగతి తెలిసీ కేసీఆర్ వారిని మార్చకుండా అతి విశ్వాసంతో ముందుకు వెళ్లి భంగపడితే.. ఇక్కడ జగన్ ఎలాగూ భంగపాటు తప్పదన్ననిర్ణయానికి వచ్చేసి.. తాను ఇంత కాలం ఉత్సవ విగ్రహాల స్థాయికి పరిమితం చేసిన ఎమ్మెల్యేలపై నెపం నెట్టేసి చేతులు దులిపేసుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే తాము కూరలో కరివేపాకులమని అర్ధమైపోయిన తరువాత ఎమ్మెల్యేలు ఇక జగన్ కు విధేయత చూపే అవకాశం ఉండదని ఆయన గ్రహించలేకపోయారు. అందుకే ఇప్పుడు వైసీపీలో అసమ్మతి నివురు తొలగిపోయి అగ్ని బయటపడుతోందని పరిశీలకుకు అంటున్నారు. ఇది ఒక్క అళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఆగే పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు. ఒక సారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత తిరుగుబాటు రూపంలో బయటకు వస్తుందని చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రం పరిణామాలతో తమకు సంబంధం లేదని, రాష్ట్రంలోని 175 సీట్లను గెలుచుకునే లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా తీసుకుంటున్న చర్యలలో భాగమే ఇది అని ఆ పార్టీ పెద్దలు ఎంతగా సమర్ధించుకోవడానికి చూసినా, జగన్ నిర్ణయాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న తీరు పార్టీలో ముసలం అనివార్యమన్న విషయాన్నే చాటుతున్నాయని చెబుతున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు 90 స్థానాలలో సిట్టింగులను మార్చాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది కచ్చితంగా పార్టీ పునాదులను కదిపేస్తుందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. గతంలో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు పార్టీలో భగ్గుమన్న అసంతృప్తిని గుర్తిస్తున్నారు. అప్పడు అసంతృప్తి చల్లారడానికి జగన్ సర్కార్ మరో రెండేళ్లు అధికారంలో ఉంటుంది. ఇప్పుడే బయటకు వచ్చి ఇబ్బందులు పడటం ఎందుకని అసంతృప్త ఎమ్మెల్యేలు భావించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక అధికారంలోకి వచ్చే ఆశ లేదు కనుక.. జగన్ ను ధిక్కరిస్తే.. తమపై జనాగ్రహం ఒకింతైనా తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి. ఈ కూటమితో బీజేపీ కలిసినా, కలవకపోయినా పెద్దగా ఫరక్ పడదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ఫలితం తరువాత సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పెద్దగా స్థానాల సంఖ్యపై పట్టుబట్టే పరిస్థితి లేదని, ఆ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాలలో జనసేనాని చెప్పేశారనీ అంటున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తు కనీసం పదేళ్ల పాటు కొనసాగాలని, అప్పుడే జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి వీలౌతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. బీజేపీ కలిసి, వచ్చినా రాకపోయినా తాను సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశంకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూస్తానని చెప్పారు. చెప్పడమే కాకుండా పార్టీని, క్యాడర్ ను అందుకు సన్నద్ధం చేస్తున్నారు. దీంతో అధికారికంగా బీజేపీ పొత్తులో ఉన్నా లేకున్నా మూడు పార్టీలూ కూటమిగానే జగన్ ను ఎదుర్కొంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఒక వేళ పోటీలో ఉన్నా అది నామమాత్రమేననీ, రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఒక శాతం ఓట్లతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం నామమాత్రమేనని అంటున్నారు. మరో వైపు తెలంగాణ ఫలితంతో ఏపీలో కాంగ్రెస్ ఏదో మేరకు పుంజుకున్నా, ఆ మేరకు నష్టం వైసీపీకేనని విశ్లేషిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా తెలుగుదేశం నెత్తిన పాలు పోస్తాయని అంటున్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తే జగన్ పార్టీ ఖాళీ అయిపోతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికలలో జగన్ కు ఓటమి తథ్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు.