Leading News Portal in Telugu

ప్రజావాణికి భారీ స్పందన | prajavani huge responce


posted on Dec 15, 2023 1:09PM

తెలంగాణలో  కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఏర్పడింది.గతంలో ప్రజాదర్బార్‌గా ఉన్న పేరును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్ల నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరగనున్నా.. 10 గంటల వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌కు చేరుకున్నారు.గతంలో ప్రగతి భవన్‌గా ఉన్న పేరును జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్‌గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వారానికి  రెండు రోజులు ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తెల్లవారుజాము వరకే ప్రజా భవన్‌కు చేరుకున్నారు. దీంతో ప్రజా భవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.