కాంగ్రెస్ నేతలకు లేని బాధ కేటీఆర్ కు ఎందుకు? | why kcr bother| where| congress| leaders| accepting| revanth
posted on Dec 17, 2023 7:30PM
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఓ అలవాటు ఉంది. సబ్జెక్టు ఏదైనా ఆయన మొదలు పెడితే ఎదుటి వాళ్ళు ఆయన మాట వినే వరకూ వదిలి పెట్టరు. ముందు మొండిగా వాదన మొదలు పెట్టి.. అవసరమైతే ఎదుటి వాళ్లను బుకాయించి, గదమాయించి, బలవంతంగానైనా తన మాటే నిజం అనేలా చేసుకొని, చివరకు అవతలి వాళ్ళను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇక కేసీఆర్ కు మరో అలవాటు కూడా ఉంది. ముందుగా శత్రు వర్గాన్ని విభజించి ఒక్కొక్కరినీ తనకి అనుకూలంగా మార్చుకొని.. తన వైపు రానివాళ్ళని వాళ్ళ వర్గంతోనే దెబ్బ తీస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ ఈ వ్యూహాన్ని మొదలు పెట్టగా.. ఆ తర్వాత కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలందరూ ఇదే వ్యూహంతో రాజకీయం చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టినా బీఆర్ఎస్ తమ పాత పద్దతులను వ్యూహాలను మర్చిపోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభ వాడీవేడీగా సాగింది. కాగా, బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలో కూర్చున్నా.. బహుశా తామింకా అధికారంలోనే ఉన్నామనే భావనలో ఉన్నట్లు కనిపించారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులో అది స్పష్టంగా కనిపించింది. వీరి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, మాటలు చూస్తే తామింకా అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చల్లో కేటీఆర్ , హరీష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యమేసింది. పదేళ్ళ కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివిధ శాఖలు చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడుతుంటే.. కేటీఆర్, హరీష్ మాత్రం పదేళ్ళకు ముందు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కర్నాటకలో ప్రభుత్వ పాలన, ఇందిరాగాంధి హయాంలో జరిగిన విషయాలపై ప్రస్తావిస్తూ బుకాయింపు మాటలతో సభను, చర్చను పక్క దారి పట్టంచాలని చూశారు.
ఇక, కేటీఆర్ అయితే తన తండ్రి విభజించు పాలించు అన్న సిద్దాంతాన్ని ఫాలో అయినట్లు కనిపించింది. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మా భట్టి అన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్న అంటూ మంత్రులను సంబోధిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వచ్చేసరికి సీఎం గారు అంటూ సంబోధించారు. అన్న అంటూ సంబోధించడం మంచిదే కదా అనుకుంటే మంచిదే.. కానీ, ఒకే పార్టీకి చెందిన మంత్రులను అన్న అంటూ సంబోధిస్తూ.. రేవంత్ రెడ్డిని మాత్రం సీఎం గారు అంటూ సంబోధించడం చూస్తే.. మంత్రులందరూ మా వారే, సీఎం ఒక్కరే కాదు అని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. ఇక మంత్రులను పేరు పేరునా అన్నా అంటూ సంభోదిస్తూ.. వీరందరు కలిసి పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే పుట్టలో దూరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దూరి ఆక్రమించుకున్నట్లు ఉందని కేటీఆర్ పాత సామెతను కాంగ్రెస్ కు అన్వయించి చెప్పారు.
కేటీఆర్ మాట్లాడింది చూసేందుకు రేవంత్ వైపు వ్యతిరేకంగా కనిపించినా.. మిగతా కాంగ్రెస్ నేతలను ఇది రెచ్చగొట్టడం లాగానే కనిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ నేతలలో ఎక్కువ శాతం మిగతా పార్టీల నుండి వచ్చిన వారే. ఉద్యమ వేళలో సమైక్య వాణిని వినిపించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారిని ఏరికోరి పార్టీలోకి తెచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. అలాంటిది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ స్వశక్తితో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆయన సీఎం అయ్యారు. రేవంత్ సీఎం అంటే మిగతా కాంగ్రెస్ నేతల నుండి వ్యతిరేకత రాలేదు. కానీ, అదేంటో కేటీఆర్ కు ఇబ్బందిగా ఉన్నట్లు ఉంది. అయినా కాంగ్రెస్ వారికి లేని బాధ కేటీఆర్ కు ఎందుకని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. కానీ, కేటీఆర్ తన తండ్రి విభజించు పాలించు సిద్ధాంతాన్ని కాంగ్రెస్ నేతలపై ప్రయోగిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.