ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు.. పేపర్లకే పరిమితమా?! | arogyasri limit hike fake| jagan| dues| hospitals| with
posted on Dec 17, 2023 7:08PM
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ విషయం ప్రకటించగా, ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం సోమవారం (డిసెంబర్ 18) సీఎం చేతుల మీదుగా మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఈనెల 19 నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ఈ కొత్త కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించి పంచనున్నారు. ఈ కార్డుల పంపిణీ కార్యాక్రమం ప్రతీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో జరిపించనుండగా ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొ్ంటారు.
కాగా, ఈ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు సాగుతుంది. జగన్ మోహన్ రెడ్డిని పేదల పాలిట పెన్నిధిగా, అపద్భాంధవుడిగా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు కీర్తించడం కోసమే ఇప్పుడీ కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆరోగ్య శ్రీ విలువ పెంచే సభకు, కార్డుల తయారీకి, కార్డుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయనుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులలో ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా? అనే విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నారా? ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఈ పథకాన్ని ఎంత మంది ప్రజలు వినియోగించుకున్నారు? జగన్ హయంలో ఇప్పటి వరకూ చెల్లించిన ఆరోగ్య శ్రీ నిధులెన్ని? ప్రస్తుతం ఆరోగ్య శ్రీ బకాయిలెన్ని అన్నది కూడా జగన్ సర్కార్ ప్రజలకు వివరణ ఇవ్వాలి.
ఎందుకంటే, నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు హయం వరకూ కాస్త ఆలస్యంగానైనా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పలు మార్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువెత్తగా, జగన్ హయాంలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులు ఆ సేవలను ఇక అందించలేమంటూ చేతులెత్తేశాయి.
ఇక మరి కొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటివి రోగుల వద్ద డబ్బులు కట్టించుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శ్రీని రూ.25 లక్షలకు పెంచితే ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాకు పదుల సంఖ్యలో ఉన్న ఆరోగ్యశ్రీ.. ఇప్పుడు జిల్లాకు పది కూడా లేకపోగా.. ఉన్న వాటిలో కూడా వైద్యం అంతంత మాత్రమే. మరి రూ.25 లక్షలకు కాదు.. రూ.కోటికి పెంచినా ప్రయోజనం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.