చంద్రబాబుతో పీకే నాలుగున్నర గంటల భేటీ..విషయమేమిటంటే? | pk meet with babu| advisor| political| strategist| women| youth| dalit| vote| bank
posted on Dec 24, 2023 3:29PM
ఏపీలో రాజకీయ పరిణామాలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కంటే వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సిట్టింగులను మార్చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ పార్టీలో ముసలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం వివిధ కార్యక్రమాలతో దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చారు. ఏపీకి వచ్చిన పీకే నేరుగా చంద్రబాబును కలిసి నాలుగున్నర గంటలకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో అలజడి మొదలైంది. ఒకవైపు పీకే మాతృ సంస్థ ఐ ప్యాక్ వైసీపీ కోసం పనిచేస్తుండగానే.. పీకే చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. ప్రస్తుతం ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్న పీకే.. ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తారా? లేదా?. పని చేసే ఉద్దేశం లేకపోతే ఇంత బహిరంగంగా ఏపీకి వచ్చి ఇన్నేసి గంటల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతారా అన్న అనుమానాలు, సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా పీకే అయితే జరగబోయే ఎన్నికల కోసం టీడీపీతో కలిసి పని చేయడం నిర్ధారణ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే, మరి పీకేకి ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ కి సంబంధాలు లేవా? ఉంటే తన సంస్థ ఒక పార్టీకి పనిచేస్తుంటే.. తాను మరో పార్టీ కోసం ఎందుకు పనిచేసేందుకు నిర్ధారించుకున్నారన్నది ఆసక్తిగా మారింది. నిజానికి పీకే 2019 ఎన్నికల తర్వాత ఐప్యాక్ సంస్థను కొంతమంది మిత్రులు, ఇతరుల చేతిలో పెట్టేసి నుండి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే, ఆ సమయంలో ఐ ప్యాక్ 22 శాతం వాటాను మాత్రం బదిలీ చేయకుండా తన వద్దే ఉంచుకున్నారు. కాగా రాజకీయాలు వేరు, సంస్థ వేరు అని ఆనాడే తన సిబ్బందికి, తన సంస్థ భాగస్వామ్యులకు ప్రశాంత్ కిషోర్ విస్పష్టంగా చెప్పారు. ఆతరువాత ఆయన బీహార్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కాగా ఏడాది కిందట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పీకేను కలిశారు. ఆ సందర్భంగా ఇరువురి మధ్యా జరిగిన చర్చలు సఫలీకృతమై ఇప్పుడు బాబుతో భేటీ వరకూ వచ్చింది. అయితే సీఎం జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఒక సంస్థను స్థాపించి ఐపాక్ సంస్థలో ఉద్యోగులను తన వైపుకు మలచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్న పీకే ఇప్పుడు ఇలా తెలుగుదేశం కోసం పనిచేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
మరి నాలుగున్నర గంటల భేటీలో పీకే చంద్రబాబుతో ఏం చెప్పారు? పీకే చంద్రబాబుకు ఇచ్చిన సలహాలూ, సూచనలేంటి? ఎన్నికల కోసం ఎలాంటి ప్రణాళికలు రచించేందుకు మాట్లాడుకున్నారు? ఇలాంటివి సహజంగానే రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారాయి. అయిత , ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం షో టైం కన్సల్టెన్సీ పేరుతో రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో పీకే కూడా టీడీపీ కోసం పనిచేస్తారా అనే చర్చలు జరిగాయి. పీకే కూడా రానున్న ఎన్నికలలోతెలుగుదేశం కోసం పనిచేస్తారు. కానీ ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా. రాబిన్ శర్మ స్ట్రాటజీలను పీకే వ్యక్తిగతంగా సూపర్ వైజ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. రాబిన్ శర్మ యధావిధిగా పనిచేయనుండగా.. పీకే మరో లెవల్ లో సూపర్ వైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ భేటీలో పీకే టీడీపీ అధినేతకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ మహిళా ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయని.. అలాగే యువత మీద ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ పై యువత చాలా ఆవేశంతో ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధిలేక ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. యువత నాడిని పట్టుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. వారి ఓటు బ్యాంకుపై ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నిత్యావరసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు, దళితులు, బీసీలపై దాడులు పెరిగిపోయాయని.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారని చెప్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పీకే మరోసారి చంద్రబాబును కలవనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ భేటీ తరువాత తెలుగుదేశంతో పీకే అనుబంధంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.