Leading News Portal in Telugu

క్రిస్మస్ పండక్కి సొంతూరికి జగన్.. ప్రజలకి కష్టాలు! | jagan kadapa tour| hell| locals| traffic| restrictions| hour


posted on Dec 24, 2023 2:34PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా కడప పర్యటనలో ఉన్నారు. శనివారం(డిసెంబర్ 23) కడప జిల్లాకు వెళ్లిన సీఎం మూడు రోజులు అక్కడ పర్యటించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఈ పర్యటన కొనసాగనుండగా.. సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అలాగే సొంత జిల్లాలో క్రిస్మస్ పండగను జరుపుకోనున్న సీఎం.. ఈ మేరకు వేడుకల్లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో బస చేసిన జగన్.. వైఎస్ఆర్ ఘాట్ లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి.. ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయలోని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమై.. గంటన్నర పాటు వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత   ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లోనే బస చేసి సోమవారం(డిసెంబర్ 25) క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మళ్ళీ పులివెందుల చేరుకుంటారు. 

ఇక అధికారిక కార్యక్రమాల విషయానికి వస్తే.. జగన్ శనివారం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిమ్స్ ఆవరణంలో క్యాన్సర్, మెంటల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని నూతన నిర్మాణ భవనాలను ప్రారంభించారు. అలాగే ఆదివారం(డిసెంబర్ 24) మధ్యాహ్నం 12:30 గంటలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.   ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్, రోడ్డు వైడెనింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. మామూలుగా అయితే, ఇటు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం. మరోవైపు క్రిస్మస్ పండగను కూడా సీఎం సొంత ప్రాంతంలో జరుపుకోనుండడం సొంత జిల్లా ప్రజలు ఆనందించాల్సిన విషయం. కానీ, జిల్లాకు సీఎం జగన్ రాక ఇప్పుడు   ప్రజలకు శాపంగా మారింది. పండగ పూట ఈ జిల్లా ప్రజలకు సీఎం కష్టాలు తెచ్చినట్లుగా భావిస్తున్నారు. 

జగన్ సొంత జిల్లా పర్యటన కారణంగా కడప నగరంలోని అన్ని దారులను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ప్రజల రాకపోకలపై తీవ్ర  ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు   నరకయాతన అనుభవిస్తూన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చే పరిసరాలు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకొని రాకపోకలపై ఆంక్షలు విధించి.. స్థానికంగా ఉన్న వలంటీర్లను, వారు తీసుకొచ్చిన జనాలను దారి పొడవునా నిలబెట్టి జగన్ కు స్వాగతం పలికించారు. ఇందు కోసం తీసుకొచ్చిన జనాలను కొన్ని గంటల పాటు నిలబెట్టారు. స్థానికులను ఆ పరిసరాల్లోకి కూడా రానీయకుండా ఆంక్షలు విధించారు. దీంతో  స్థానికులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నగరంలోని వివిధ రోడ్లపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడి గంటల తరబడి రోడ్లపైనే నీరిక్షించాల్సి వచ్చింది. ఎంత  సీఎం వస్తే మాత్రం ఇలా నగరం మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. 

జిల్లాకు సీఎం రాక, పోలీసుల ఆంక్షలు, ప్రజల కష్టాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి. ఈశ్వరయ్య తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఈశ్వరయ్య.. జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే రాచరికం గుర్తొస్తుందని విమర్శించారు. రాజు వస్తుంటే దారికి ఇరువైపులా ప్రజలు వంగి వంగి దండాలు పెట్టే విధంగా ఈయన వలంటీర్ల ద్వారా ప్రజలను అలాగే బానిసల్లా నిలబెట్టారని, ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల వద్ద ఉండాలి తప్ప ఇలా పోలీసు బలగాలతో నగరాన్ని వారి అధీనంలోకి తీసుకొని, ప్రజలను నిర్బంధించి వేధించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అలాగే, గతంలో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేయడం, శంకుస్థాపనలు చేసిన వాటికి మళ్ళీ శంఖుస్థాపనలు చేయడం కోసం ఇంత హడావుడి చేయడం ఎందుకని మండిపడ్డారు. కాగా  సీఎం సొంత జిల్లాలో పర్యటించేందుకు కూడా ఈ స్థాయిలో భయపడుతూ ప్రజలపై ఆంక్షలు విధించడంపై ఇటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు  సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా జగన్ ను ఏకిపారేస్తున్నారు. జగన్ సొంత ఊరిలో పర్యటించేందుకు కూడా ఇంతలా భయపడడం పరికిపంద చర్యగా పేర్కొంటున్నారు.