Leading News Portal in Telugu

ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి.. జనసేన నమ్ముతుందా? | will janasena believe prudhwi| ycp| 2019| elections| thirty| years| industry| critisize| pawan


posted on Dec 25, 2023 6:44AM

వైసీపీలో విశ్వాసంగా పని చేసిన వారిని పార్టీకి దూరం చేయడం జగన్ నైజంగా కనిపిస్తోంది. థర్టీ యియర్స్ యిండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ నుంచి తాజాగా మాజీ మంత్రి బాలినేనికి పార్టీలో ఎదురౌతున్న పరిస్థితి వరకూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.  ఇక ఇప్పుడు విషయానికి వస్తే జగన్ ను నమ్ముకుని రాజకీయ ప్రవేశం చేసిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయినట్లే కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నటుడు పృధ్వీరాజ్ అప్పట్లో పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం కోసం తన స్థాయికి మించి, స్థాయిని మరిచి కూడా కష్టపడ్డారు.   జగన్ ను పొడగటం, ఆయన ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడంలో పరిధులు మరచిపోయారు. ఆ ఎన్నికల సందర్భంగా ఊరూరా తిరిగి అదే పని చేశారు. 

 పార్టీ ప్రచారంలో  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇష్టారీతిగా  విమర్శలు గుప్పించారు. అదే ప్రచారమనుకున్నారు. జగన్ ను మొప్పించాలంటే ఆయన ప్రత్యర్థులను తిట్టడం ఒక్కటే మార్గం అని భావించారు.  సరే  రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఏమో కానీ  ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.  

సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగన్   ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి యిచ్చి గుర్తించారు.  ఆ మాత్రం గుర్తింపు చాలనుకున్నారో ఏమో, లేదా ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రత్యర్థులను తిట్టినందుకే ఈ పదవి వచ్చింది. ఇదే కొనసాగిస్తే   జగన్ మెచ్చి మరింత పదవి ఇస్తారని తలంచాడో ఏమో (అలా భావించి యిప్పటికీ ప్రత్యర్థులపై తిట్లపురాణంతో చెలరేగిపోతున్నవారు ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు. అలా చెలరేగిపోయి యిప్పుడు పార్టీలో ఎవరికీ పట్టనట్టుగా మిగిలిపోయిన వారూ ఉన్నారు.)    కానీ, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డాడు ఫృధ్వి. చివరకు  అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ  యియర్స్ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే, పృధ్వీ ఎస్వీబీసీ వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది. 

ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు.   ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత  వైసీపీలో పృధ్వీరాజ్ ను పట్టించుకున్న వారు లేరు. ఆయన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గుర్తింపు మొత్తం ఆయన తీరు వల్ల గుండు సున్నా అయిపోయింది. ఎందుకంటే  నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందూ చూసుకోకుండా నోరు పారేసుకున్న  పాపానికి సినీ పరిశ్రమ కూడా ఆయన్ని దూరం పెట్టేసింది. పృధ్వీ రాజకీయ ప్రవేశం చేసే నాటికి  సినీ ఇండస్ట్రీలో ఆయన్ని ఇండస్ట్రీలో ఆయన పీక్ ఫామ్ లో ఉన్నారు. కమేడియన్ గా బ్రహ్మానందంకు ప్రత్యామ్నాయం ఫృధ్వే అంటే అప్పట్లో పరిశ్రమ కూడా భావించింది. అయితే  జగన్ పార్టీలో చేరిన తరువాత ఆయన తీరు, మాటలు, విమర్శల కారణంగా ఇండస్ట్రీ పృధ్విని పట్టించుకోవడం మానేసింది. ఇక నమ్ముకున్న జగన్ పార్టీ కూరలో కరివేపాకులా తీసి పారేసింది. ఆయన వాయిస్ రికార్డ్ బయటకు రావడం వల్లే పార్టీ విసిరి పారేసిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే   దాదాపుగా ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబుకు మంత్రిగా పదోన్నతి లభించింది. దీంతో  థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడి బొమ్మ కనిపించింది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రపన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు,    పక్క చూపులు  చూశారు. జనసేన పార్టీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలూ చేశారు. జనసేనానిని కలిశాననీ, ఆయన హామీ ఇచ్చారనీ చెప్పుకున్నారు. 

 ఇక అప్పటి నుంచీ ఆయన మీడియా టాక్ షోలలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పవన్ కల్యాణ్ ను పొగడడమే పనిగా పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో జనసేన 40 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పాడు. అయితే ఇవేమీ ఆయనను జనసేనకు దగ్గర చేసిన దాఖలాలు కనిపించలేదు.  ఎందుకంటే  గతంలో ఇదే థర్టీ యిండస్ట్రీస్ పృద్వీ అందరి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించాడు గుర్తు చేస్తూ జనసైనికులు పృధ్విని దూరంగా ఉంటుతున్నారు. 

రాజకీయాలలో విమర్శలూ, ఆ తరువాత పొగడ్తలూ చేయడం నాయకులకు సాధారణమేననీ, గతంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా చేసిందీ అదే కదా అంటున్న వారు లేకపోలేదు. అయితే, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ స్థాయిని మరచి, మించి చేసిన అతి వలనే జనసేన ఆయనను దూరం పెడుతోందనీ, పెడుతుందనీ పరిశీలకులు చెబుతున్నారు. , అందుకే పృధ్వి అటు ఇండస్ట్రీ, ఇటు జనసేన కూడా దూరం పెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. 

తాజాగా జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ పృధ్వి చేసిన ప్రకటన.. పాపం పృధ్వి అనేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ పృధ్వి జనసేన సభ్యుడు కాదు. పార్టీలో ఆయనకు ఎంట్రీ ఇవ్వలేదు. ఏదో తనమానాన తాను పవన్ కల్యాణ్ పార్టీలో ఉన్నానని చెప్పుటుంటూ తిరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా తాను పోటీకి సిద్ధం అంటూ చేసిన ప్రకటన కమేడియన్ పృధ్విని నవ్వుల పాలు చేసిందనడంలో సందేహం లేదు.

అయితే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా.. తగ్గేదే లే అంటూ  తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమి 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో  అద్భుత  విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. యువగళం ముగింసు సందర్భంగా విజయనగరంలో జరిగిన సభ విజయోత్సవ సభలా ఉందన్నారు. మంత్రి రోజా వంటి వారి  నో ర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించాడు. అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ కు  పనికొస్తారని సెటైర్లు వేశాడు. నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసమంటూ నిలదీశారు.  అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దంటూ జనసైనికులు సూచించారు.  ఇంతకీ జనసేన తరఫున పోటీకి ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్శికి పార్టీ తరఫున పోటీకి అవకాశం ఇస్తుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.