కక్ష సాధింపు సాధనంగా ఎల్ఓసీ? ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు! | indiscriminate usage of loc| political| venditta| yasawi| ap| cid| arrest| democracy
posted on Dec 25, 2023 7:32AM
దేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర వార్త ఛానల్. జర్నలిజంలో అత్యున్నత విశిష్ట పురస్కారాలు అనేకం అందుకున్న సంస్థ అయిన యన్ డి టివి వ్యవస్థాపకుడు, సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధిక రాయ్ 2019 లో ముంబాయి విమానాశ్రయం నుండి విదేశాలకు వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద యల్‌ఓసి జారి అయ్యిందంటూ సీబీఐ అడ్డుకుంది. నిరాధారమైన అక్రమ కేసులు బనాయించి తనను బెదిరించడానికి పాలకుల పన్నాగంలో భాగమే ఇదని అప్పట్లో ప్రణబ్ రాయ్ ఆరోపించారు. ఆ తరువాత కొద్ది రోజులకే యన్ డి టివి కొత్త యజమానిగా గౌతమ్ ఆదాని తెరమీదకు వచ్చారు.
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జారీ చేసే ఎల్ఓసి ( లుక్ అవుట్ సర్కులర్ ) ఇప్పుడు ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగించడం పెను విషాదం . వ్యవస్థలను , చట్టాలను భ్రష్టు పట్టించి వ్యక్తిగత కక్షలకు ఎల్ఓసి దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. ఎల్ వో సి అనేది ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కు విదేశీ ప్రయాణాన్ని నిరోధించడానికి జారీ చేసే నోటీసు . ఆర్థిక నేరస్తులు, తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు దేశం విడిచి వెళ్ళకుండా నిరోధించడం, నిర్బంధించడం యల్ ఓసీ లక్ష్యం. మనదేశంలో మొట్టమొదటి ఎల్ఓసి 1976లో జారీ అయ్యింది. ఇతర దేశాల్లో ఎల్ఓసిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అమెరికాలో నో ఫ్లై లిస్ట్
అని పిలుస్తారు . ఆస్ట్రేలియాలో డిపార్చర్ ప్రొహిబిషన్ ఆర్డర్ అంటారు.
2019లో సినీ నటుడు శివాజీ అమెరికా ప్రయాణాన్ని దుబాయ్ లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వీసాను రద్దు చేసి వెనక్కు పంపేసారు . కారణం టివి9 యాజమాన్యంలో తలెత్తిన గొడవలు . రవిప్రకాష్, శివాజి మధ్య వ్యక్తిగత ఆర్థిక లావాదేవిల కారణంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి పోలీసు శాఖ నుండి అధికారిక ఈ మెయిల్ కారణం అని శివాజీ మీడియాకు తెలియజేసారు. శివాజీ సంఘ విద్రోహా శక్తి అన్నది ఆ ఇమెయిల్ సారాంశం. కనుచూపుమేరలో శివాజీ అమెరికా వెళ్ళలేరు . ఎంత అమానవీయం వ్యక్తిగత కక్షలకు వ్యవస్థలను దిగజార్చి వ్యక్తి సేచ్చను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. పాలకుల ఇష్టాయిష్టాలకు లోబడి వ్యవస్థల పని తీరు ఉండటం అన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంత మాత్రం దోహదం చేయదు.
ఇటీవల కాలంలో ఎల్ఓసి జారీలో పారదర్శకతకు పాతర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. 1967 పాస్ పోర్ట్ చట్టాన్ని అనుసరించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఎల్ఓసి జారీ చేసే అధికారం ఉంటుంది . ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరం అయితే పాస్ పోర్ట్ రద్దు చేయడానికి కూడా అధికారం ఉంటుంది. సిబిఐ , ఈడి ,ఎస్ఎఫ్ఐఓ ( సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్), ప్రభుత్వ బ్యాంకులతోసహా మరో పదిహేను ప్రభుత్వ ఏజెన్సీలకు యల్ఓసి జారీ అధికారం ఉంది. ఒకసారి ఎల్ఓసి జారీ అయితే, జారీ చేసిన ఏజెన్సీ దాన్ని రద్దు చేసే వరకూ లేదా కోర్టు తీర్పు ద్వారా రద్దు అయ్యే వరకూ ఆ ఎల్ఓసి అమలులో ఉంటుంది. ఎల్ఓసి జారీ ప్రక్రియ వ్యక్తిగతంగా చిక్కులు తెచ్చిపెడుతుంది. అందువల్ల అసాధారణ పరిస్థితిలో మాత్రమే ఎల్ఓసి జారీచేయాలి. అయితే ఇటీవలి కాలంలో విచక్షణా రహితంగా, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో నేరాలకు పాల్పడని వారిపై కూడా ఎల్ఓసి జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది . తప్పుడు కేసులు బనాయించడం, లేదా ఉన్న కేసుల్లో సాక్షులు నిందితులుగా మారే అవకాశం ఉందని, కేసు విచారణలో ఉందని ఎల్ఓసి జారీ చేస్తున్నారు.
ఇటీవల మార్గదర్శి యం డి సిహెచ్ శైలజా కిరణ్ తన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవం కోసం అమెరికా వెళ్లారు. ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చే సమయంలో ఏపి సిఐడి లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. శైలజా కిరణ్ వ్యక్తిగత ప్రతిష్ట, మార్గదర్శి విశ్వసనీయత దెబ్బతీయడమే లక్షంగా యల్ఓసి జారీ చేసారని ఆమె తెలంగాణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు రక్షణతో ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుండి ఇంటికి చేరుకోగలిగారు .
ఎల్ వో సి జారీ చేయబడిన వ్యక్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయంలో అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవటం వ్యక్తి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే. రాజకీయ కక్షపూరితంగా వ్యక్తుల స్వేచ్చను అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుంది. చట్టం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తూ, పౌరుల స్వేచ్ఛను హరించడానికి ఎల్ఓసి కారణం కాకూడదు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వి అమెరికా నుండి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఏపీ సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి నాలుగేళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన యశస్విని ఏపీ సీఐడీ అదుపులోనికి తీసుకుంది. అమానుషంగా అమ్మను ఒక్కసారి చూసి మీ వెంట వస్తాను అని యశశ్వి కోరినా సీఐడి ఎల్ఓసీ అంటూ అదుపులోనికి తీసుకుంది. యశస్విపై ఎల్ఓసీ జారీకి ఒకే ఒక్క కారణం ఆయన జగన్ సర్కార్ విధానాలను సామాజిక మాధ్యమం వేదికగా ప్రశ్నించడమే. ప్రశ్నిస్తే లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం ఏపీ సీఐడి బరితిగింపునకు, జగన్ సర్కార్ తెంపరితనానికీ నిదర్శమని పలువురు విశ్రాంత పోలీస్ అధికారులు వ్యాఖ్యానించారు.
చట్టంలో అస్పష్టమైన నియమ నిబంధనల కారణంగా పదునైన చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం సరికాదు. యల్ ఓ సి అనేది దేశానికి ఉపయోగపడే సాధనం. తీవ్రమైన ఆర్థిక నేరస్తులు ఇప్పటికే చాలామంది దేశం దాటి వెళ్లిపోయారు. విదేశాల్లో దాక్కున్న ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చే చిత్తశుద్ధి పాలకుల్లో లేదు. దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళకు సత్వర శిక్షలు పడే అవకాశం కను చూపు మేర కనిపించడం లేదు. పాలకులే నేరగాళ్ళతో కుమ్మక్కుఅవ్వడం లేదా నేరగాళ్లే పాలకులవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.