Leading News Portal in Telugu

ఏపీలో రెండు కొత్త పార్టీలు.. ప్రయోజనమేంటి? ప్రభావమెంత? | two new parties in ap| politics| elections| votes| divide| tdp| janasena


posted on Dec 26, 2023 6:19AM

సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకువస్తుంటాయి. అది సహజమే. అలా పుట్టుకొచ్చేపార్టీల వల్ల ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది. ఏ పార్టీ నష్టపోతుంది అన్న చర్చలైతే జరుగుతాయి. అలాగే ఏపీలో మరోమూడు నాలుగు నెలల్లో  అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరణంలో ఏపీలో నూతనంగా ఆవిర్భవించిన రెండు పార్టీలపై విస్తృత చర్చ జరుగుతోంది.

కొత్తగా ఆవిర్భవించిన రెండు పార్టీలలో ఒకటి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్  పార్టీ కాగా, రెండోది సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి స్థాపించిన  తెలుగు సేన  పార్టీ. ముందుగా జైభారత్ నేషనల్ పార్టీ విషయాన్ని తీసుకుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్థన్ రెడ్డి కేసుల దర్యాప్తుతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా జేడీ లక్ష్మీనారాయణగా   పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు వీవీ లక్ష్మీనారాయణ అయినా అందరూ ఆయనను జేడీ లక్ష్మీనారాయణగానే గుర్తు పడతారు. అటువంటి జేడీ లక్ష్మీనారాణయ 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని  రాజకీయాల్లోకి వచ్చారు.  సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో   ప్రసంగాలతో  యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే సొంత రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన జనసేన పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో జేడీ లక్ష్మీనారాయణ రెండున్నర లక్షల ఓట్లకుపైగా సాధించి మూడవ స్థానంలో నిలిచారు. వీవీ లక్ష్మీనారాయణ పోటీ చేయడం వల్ల జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా విశాఖ లోక్ సభ స్థానం స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ గెలుపొందారు. టీడీపీ అభ్యర్ధి భరత్  పరాజయం పాలైయ్యారు.

ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుండి బయటకు వచ్చి స్వచ్చందంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. రాబోయే ఎన్నికల్లోనూ విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరతారు అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీని ప్రారంభించడం సంచలనం సృష్టించింది.   ఈ పార్టీ అభ్యర్ధుల ప్రభావం ఏ రాజకీయ పార్టీపై పడుతుంది అన్నదానిపై చర్చ జరుగుతోంది.  తెలుగుదేశం, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉండే నియోజకవర్గాలలో నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటములపై  జై భారత్ నేషనల్ పార్టీ ప్రభావం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ విధానాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన జగన్ పార్టీలో చేరతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా సొంతంగా పార్టీ పెట్టడంతో ఆయన జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే సొంత పార్టీ స్థాపించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   గతంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులను పోటీ పెట్టినా ఆయన ఒక్కడు మాత్రమే విజయం సాధించారు. కానీ ఆ పార్టీ అభ్యర్ధుల ప్రభావం చాలా నియోజకవర్గాల్లో నాటి ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులపై పడిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని జై భారత్ నేషనల్ పార్టీ లక్ష్యంకూడా అదేనా అన్న రీతిలో వారి విశ్లేషణలు సాగుతున్నాయి. 

ఇక మరో కొత్త  పార్టీ తెలుగుసేన విషయానికి వస్తే ఈ పార్టీని సీనీ దర్శక, నిర్మాత సత్యారెడ్డి  స్థాపించారు.   అయ్యప్ప దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా 53 సినిమాలు తీసిన సత్యారెడ్డి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను   అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు  ప్రకటించారు.  కొద్ది నెలల క్రితం పుంగనూరుకు చెందిన పారిశ్రామిక వేత్త బొడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆవిర్భవించింది. రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలువనున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా, తెలుగుదేశం, జనసేన పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆవిర్భవించిన కొత్త పార్టీల ప్రభావం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్న చర్చ జరోగా సాగుతోంది.