Leading News Portal in Telugu

సీఎం రేవంత్ కు కరోనా పరీక్షలు | corona tests to cm revanth| frver| cough| cold


posted on Dec 26, 2023 5:47AM

కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలకు కరోనా వ్యాప్తి కట్టడికి సూచనలు చేసింది. కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, దగ్గు జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే వైద్యులు ఆయన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినట్లు సమాచారం. కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 వేగంగా వ్యాప్తి చేందుతున్న తరుణంలో రేవంత్ అస్వస్థతకు గురి కావడం, ఆయనకు వైద్యులు కరోనా టెస్టులు చేయడతో కాంగ్రెస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. రేవంత్ కు కరోనా పాజిటివ్ వస్తే ఇటీవలి కాలంలో ఆయనతో సమీక్షల్లో పాల్గొన్న అధికారులు, మంత్రులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.  

కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్‌తో పలువురు  ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా 12 (డిసెంబర్ 24) కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రస్తుతం తెలంగాణలో 38 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఉంటే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.

ఇలా ఉండగా రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్తల్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది.   సీఎం రేవంత్‌ అస్వస్థతకు లోనయ్యారని,   జ్వరం వచ్చిందని, గొంతు నొప్పితో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.   వాస్తవానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది.