జగన్ ఓటమే టార్గెట్.. పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి షర్మిల? | sharmila as congress candidate in pulivendula| congress| praposal| ysrtp| merger| grand| old| party| ycp| big
posted on Dec 26, 2023 11:53AM
తెలుగుదేశం ఎంపీగా షర్మిల అంటూ గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమం వేదికగా పలు కథనాలు ప్రచారమయ్యాయి. వీటన్నిటికీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడమే కారణం. అదే సమయంలో తన సోదరుడు జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు కాదు కదా, ఇదే నెలలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా షర్మిల ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. సొంత అన్నను పూర్తిగా విస్మరించి, ఆయన ప్రత్యర్థి పార్టీలో కీలక నేత అయిన లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపడంతో.. జగన్, షర్మిల మధ్య విభేదాల విషయంలో ఏ మాత్రంగానైనా ఎవరిలోనైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ నివృత్తి అయిపోయాయి. 2019 ఎన్నికల ప్రచారం కోసం తన సేవలను ఉపయోగించుకున్న సొంత అన్న జగన్ ఆ ఎన్నికల తరువాత తనకు పూచిక పుల్ల విలువ సైతం ఇవ్వకుండా, పార్టీలో ఉండనీయకుండా, అసలు రాష్ట్రంలోనే ఉండలేని పరిస్థితులు కల్పించిన తీరుపై షర్మిల గుర్రుగా ఉన్నారు. పలు సందర్భాలలో అన్న తీరును, విధానాలనూ తప్పుపడుతూ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఎలాంటి మొహమాటాలూ లేకుండా జగన్ కు వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారన్న సంకేతాలు ఇచ్చేశారు. అయితే లోకేష్ కు క్రిస్మస్ గిఫ్టులు పంపినంత మాత్రాన ఆమె తెలుగుదేశం గూటికి చేరుతారని భావించడం సరికాదనీ, ఆమె చూపు ఇప్పటికీ కాంగ్రెస్ వైపే ఉందనీ ఆమెకు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా రాజకీయరంగ ప్రవేశం చేసిన షర్మిల.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో క్లియర్ గానే ఉన్నారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ దిశగా జరగిన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయనీ, ఇప్పుడు అవి ఫలవంతమౌతున్నాయని చెబుతున్నారు.
షర్మిల టార్గెట్ తన అన్న జగన్ అయినప్పుడు ఆమె తెలుగుదేశం గూటికి చేరడం వల్ల జగన్ కు ప్రత్యర్థిగా మాత్రమే ఉండగలరనీ, అదే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు అందుకుంటే.. జగన్ కు తేరుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టడం అంటూ జరిగితే ఇక జగన్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని అంటున్నారు.
ఏపీ ప్రజలే కాదు, వైసీపీ నేతలు కూడా జగన్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిని చూడలేకపోతున్నారనీ, అందుకే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆమె వెంట నడిచేందుకు రెడీ అవుతారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ క్షేత్ర స్థాయిలో అంతో ఇంతో బలం ఉంది. అయితే విభజన సందర్భంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిన కారణంగా కాంగ్రెస్ ను ఈ పదేళ్లూ దూరం పెట్టారు. అయితే జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన అరాచక పాలన చూసిన తరువాత జనంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కంటే జగన్ పాలన పట్ల ఆగ్రహమే ఎక్కువగా కనిపిస్తోంది.
జగన్ ను గద్దె దించాలన్న నిర్ణయానికి వచ్చేసిన జనం తెలుగుదేశం, జనసేన కూటమికి అధికారం కట్టబెట్టడానికి రెడీ అయిపోయారు. ఈ రెండు పార్టీల కలయికతో జగన్ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అభ్యర్థుల మార్పు అంటూ ఏవేవో వ్యూహాలు, ఎత్తుగడలతో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి లబ్ధి పొందే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్త పార్టీల ఏర్పాటుకు తెర వెనుక ప్రోత్సాహం అందిస్తున్నారు. అలా పుట్టుకు వచ్చినవే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జైభారత్ నేషనల్ పార్టీ, సినీ దర్శన నిర్మాత సత్యారెడ్డి ఏర్పాటు చేసిన తెలుగుసేన పార్టీలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఏపీలో చురుకుగా పావులు కదుపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసంపూర్తిగా మిగిలిన షర్మిల పార్టీ విలీనం చర్చలను తెరపైకి తీసుకువచ్చింది. షర్మిలకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఆమె కోరిన స్థానం నుంచి, ఆమె అంగీకరిస్తే పులివెందుల నుంచి జగన్ ప్రత్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు కూడా ప్రతిపాదించింవదని చెబుతున్నారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే కొత్తగా పుట్టుకు వచ్చిన పార్టీల ద్వారా జగన్ అశించే ప్రయోజనం సిద్ధించదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు. వైసీపీ ఓటు కూడా ఆ పార్టీకి దూరం అవుతుందని చెబుతున్నారు. అలాగే తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల కోసం జగన్ వెతుక్కునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న పలువురు సీనియర్ నేతలంతా కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే. వారెవరూ ఇప్పుడు వైసీపీలో హ్యాపీగా లేరని అంటున్నారు. జగన్ ఒంటెత్తు పోకడలు, అహంభావం, పార్టీలో దక్కని గౌరవంతో గత్యంతరం లేక వైసీపీలో గత్యంతరం లేక కొనసాగుతున్న పలువురు కాంగ్రెస్ హస్తం అందుకుంటారని అంటున్నారు. అయితే తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజలలో సానుకూలత ఇసుమంతైనా లేదు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పాట్ల సానుకూలత ఉంటే, ఏపీలో మాత్రం తమ అభీష్ఠానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండుగా ముక్కులు చేసిందన్న ఆగ్రహం బలంగా వ్యక్తం అవుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీలో జనం ఆ పార్టీని అసెంబ్లీలో అడుగుకూడా పెట్టనివ్వకుండా శిక్షించారు. పదేళ్ల తరువాత కూడా ఏపీ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవాలంటే షర్మిలను పార్టీలో చేర్చుకుని రాష్ట్ర పగ్గాలు అప్పగించడమే మార్గమని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.
ఏపీ జనం దివంగత సీఎం వైఎస్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు జగన్ కు 2019 ఎన్నికలలో ఒక చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు. అయితే సీఎంగా ఆయన తీరు, ఆయన పాలనపై నాలుగున్నరేళ్లలోనే విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది. అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ తనయ షర్మిల అడుగుపెడితే.. ఏపీ కాంగ్రెస్ లో ఒక్క సారిగా నూతనోత్సాహం వస్తుందని కాదు కానీ.. అధికార వైసీపీ మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది. ఏదో ఒక మేరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ వారసుడిగా భావించి జగన్ పంచన చేరిన పూర్వ కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వలస వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. జగన్ పార్టీలో ఇమడ లేక, మరో మార్గం కానరాక పార్టీలోనే అనామకులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరొక్కరుగా లేదా గంపగుత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైసీపీలో ఆందోళన తారస్థాయికి చేరుకోవడం వెనుక కారణం అదే. షర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ బలపడుతుందని చెబుతున్నారు. విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా విపక్షంగా ఎదిగే అవకాశం షర్మిల రాకతో కాంగ్రెస్ కు దక్కినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే.. షర్మిల కూడా కాంగ్రెస్ వైపునకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్, షర్మిల మధ్య చర్చలు పూర్తయ్యాయనీ, షర్మల పార్టీ కాంగ్రెస్ విలీనానికి, ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించడానికి నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అన్నీ కుదిరితే నూతన సంవత్సరారంభం రోజే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. నేడో రేపో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.