Leading News Portal in Telugu

ఏపీ కాంగ్రెస్ కోసం రంగంలోకి రేవంత్?.. జగన్ కు బిగ్ షాక్ | revanth for ap congress| target| ycp| mlas| leaders| dissidents| invite| party| telangana| assets


posted on Dec 26, 2023 12:34PM

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు సెగలు రేపుతున్నాయి. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఉమ్మడి  శంఖారావం పూరించాయి. ఆ దెబ్బకే అధికార  వైసీపీ బిక్కుబిక్కుమంటూ గెలుపు దారులు కనిపించక మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగుల మార్పు పేరుతో సొంత పార్టీలోనే ముసలం పుట్టే పరిస్థితి తెచ్చుకుంది. ఇది చాలదన్నట్లు ఏపీలో కాంగ్రెస్ పార్టీ  కూడా జగనే  లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  ఇప్పటికే దక్షణాదిలో కర్ణాటక, తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ .. ఇప్పుడు ఏపీని టార్గెట్ చేసుకున్నది.  ఏపీ కాంగ్రెస్ కోసం దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి,  వైఎస్ఆర్టీపీ అద్యక్షురాలు షర్మిల రంగంలోకి దిగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. షర్మిల తన వైఎస్సార్టీపీని  కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఏపీపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ మేరకు నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పటికే వైసీపీలో వణుకు ప్రారంభమైంది.  ఇప్పుడు షర్మిల రూపంలో మరో షాక్ తప్పదా అన్న భయం మొదలైంది.  

ఈ రెండూ చాలవన్నట్లు ఇప్పుడు వైసీపీకి తెలంగాణ సీఎం రేవంత్ రూపంలో మరో గండం పొంచి ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు,  అందునా సింగిల్ హ్యాండ్ తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం దక్కించుకోగల స్థాయికి చేర్చిన సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రేవంత్  ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం కంకణం కట్టుకున్నారని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే రేవంత్ వర్గం నేతలు పని మొదలు పెట్టేశారనీ,  ఏపీలోని వైసీపీ నేతలతో రేవంత్ టచ్ లోకి వచ్చిందని అంటున్నారు. రేవంత్ దూతగా ఒకరు తెలంగాణలోని ఏపీ వైసీపీ నేతలతో  సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో సిట్టింగుల  మార్పు, కొందరు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ వంటి విషయాలపై టార్గెట్ చేసిన రేవంత్ దూత.. వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా తెలంగాణలో వ్యాపారాలు, ఆస్తులు ఉన్న వైసీపీ నేతలను రేవంత్ టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి జగన్ కు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రేవంత్ జగన్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, నాయకులకు తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికారం మార్పుతో తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. రేవంత్ సీఎం కావడంతో టీడీపీ నేతలకు ఆయనతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారు ధీమాగా ఉన్నారు. ఇక వైసీపీ నేతలకే ఇక్కడ చిక్కు వచ్చి పడింది.  అటు చూస్తే ఏపీలో అధికారం కోల్పోవడం పక్కా అనేది నిర్ధారణైపోయింది. అటు ఏపీలో చంద్రబాబు సీఎం అవుతారనీ, తెలంగాణలో రేవంత్ సీఎంగా ఉన్నారనీ, వీరిద్దరి మధ్యా ఉన్న గురుశిష్యుల సంబంధం అందరికీ తెలిసిందేననీ, ఆ కారణంగా తమకి చిక్కులు తప్పవని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ దూత ఒకరు ఇలాంటి ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు రేవంత్ ఈ దూత ద్వారా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాదులో మీ వ్యాపారాలకు సహకరిస్తాం.. కాంగ్రెస్ లో  చేరితేనే సుమా అంటూ ప్రతిపాదిస్తున్నారని వైసీపీ వర్గీయుల ద్వారానే తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరితే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా తాము అన్ని విధాలుగా అండ ఉంటామని భరోసా ఇస్తున్నారనీ,  కేంద్రంలో కూడా మోడీ హవా తగ్గుతుందని చెబుతూ..  కాంగ్రెస్ లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారంటున్నారు.

ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ఆఫర్ కు  సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. వైసీపీలో ఉన్నా ఈసారి టికెట్ ఉండదు, ఒక వేళ టికెట్ ఇచ్చి నియోజకవర్గం మార్చినా గెలుపు గ్యారంటీ లేదు అన్న నిర్ణయానికి వచ్చేసిన పలువురు ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ లోకి జంప్ చేయడమే బెటరనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ లోకి వెళ్తే తెలంగాణలో ఐదేళ్ల పాటు తమ వ్యాపారాలకు, ఆస్తులకూ ఢోకా ఉండదు.  ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది కనుక కాంగ్రెస్ లో ఉన్న తమపై ఒత్తిడీ ఉండదన్న భావనలో వారు ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రతిపాదనకు ఓకే చెప్పేయడానికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  వైసీపీ నుంచి తక్కువలో తక్కువ 40 మంది  నేతలను చేర్చుకుని.. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ఎదగాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసేందుకు చూస్తున్నారు. ఇందుకు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ దాదాపు ఖాళీయేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.