Leading News Portal in Telugu

ఓడిపోయి బతికిపోయాను.. జనం తీర్పు మేలు చేసింది.. దగ్గుబాటి | daggubaty express happy for his defeat| paruchuru| ycp| 2019| elections| jagan| hitesh| mlc| minister


posted on Dec 26, 2023 3:19PM

పొలిటికల్ లీడర్లు ఎక్కడైనా ఎన్నికలలో తనను ఓడించిన ప్రజలను తిట్టుకుంటారు. పైకి ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పినా.. లోలోపల మాత్రం ప్రజలపై కోపం పెట్టుకుంటారు. ఇక గెలిచిన వారైతే తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తారు. గెలిచిన తర్వాత వారు జనాలను ఏ మాత్రం పట్టించుకుంటారన్నది పక్కన పెడితే..  ముందైతే తనకి ఓటేసిన ప్రజల పట్ల అమితమైన గౌరవంగా ఉంటారు. కానీ  ఈయన రూటే సెపరేటు.  తనను ఓడించి ప్రజలు మంచి పనిచేశారని వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వయానా తోడల్లుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు పెద్దల్లుడు,   ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఔను.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రజలు తనను ఓడించి మంచి పనిచేశారని, అదే గెలిచి ఉంటే ఇప్పటి పరిస్థితిలో తలెత్తుకొని బయట తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019లో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో దగ్గుబాటి 1,647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం వైసీపీతో ఆయన దెగదెంపులు చేసుకుని.. గత నాలుగున్నరేళ్లుగా అసలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సొంత గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు స్థానిక పరిచయాలతో కాలం గడిపేస్తున్నారు. అప్పటి నుండి ఏపీ రాజకీయాలపై దగ్గుబాటు ఎక్కడా మాట్లాడింది కూడా లేదు. తన సతీమణి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనా సరే ఆయన బయటకొచ్చి మాట్లాడింది కూడా లేదు. కానీ  అనూహ్యంగా ఇప్పుడు ఆయన బయటకొచ్చారు. రావడమే కాదు ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. వైసీపీ తరఫున పోటీచేసిన నన్ను పర్చూరు ప్రజలు ఓడించి మంచి పనిచేశారు. అదే గెలిచి ఉంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఏ పనీ చేయలేకపోయేవాడినని దగ్గుబాటి పేర్కొన్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పర్చూరులో తాను ఓటమి పాలు కావడం ఈ రోజుకు మంచిదే అని అన్నారు. తాను నాడు గెలిచి ఉంటే జనం ముందు తలెత్తుకుని తిరిగే వాడిని కాను అన్నారు. రోడ్లు బాగా లేవు అని ప్రజలే తనను నిలదీసేవారని వైసీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా ప్రజలు చేయలేదు ఆ దేవుడే చేశాడని అన్నారు. అందుకే తాను ఓటమి చెందడం భగవంతుడు తనకు ఇచ్చిన  వరం  అన్నారు. ఎన్నికై ఉంటే, ఓటర్ల కోసం ఏమీ చేయనందుకు, చేయలేకపోయినందుకు తల ఎత్తుకుని తిరగలేకపోయేవాడిని డాక్టర్ దగ్గుబాటి పేర్కొన్నారు. అలాగే, ఇక తాను ఓడాక సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని మాట ఇచ్చారని, అది కూడా జరగలేదంటే.. అదంతా చేసింది భగవంతుడే అని వెంకటేశ్వర రావు అన్నారు. తాను ఎమ్మెల్యే అవ్వలేదు, తన కొడుక్కి ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు.. ఇదంతా దేవుడి దయ అని చెప్పుకున్నారు. ఇక తన సతీమణి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీలో చేరడం కూడా తమను ఇష్టం లేదని, కానీ బలవంతంగా చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

కాగా, వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారాయి. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలందరిదీ ఇప్పుడు అదే పరిస్థితని, ఎక్కడికక్కడ ప్రజలు మొహం మీదే ఏం చేసారని ప్రశ్నిస్తున్నారని, ఏ ఎమ్మెల్యే కూడా ప్రజలకు సమాధానం చెప్పలేక మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే ఒకవేళ దగ్గుబాటి కూడా గెలిచి ఉంటే అదే పరిస్థితి ఆయనకు వచ్చేదని, అదే విషయాన్ని ఆయన చెప్పినట్లు భావిస్తున్నారు. ఇక, ఆయన కుమారుడు హితేష్ జగన్ ప్రభుత్వంలో మంత్రి అయి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడేదని, తల్లి పురందేశ్వరీ హితేష్ పై విమర్శలు చేయాల్సి వచ్చేదని, ఇదంతా జరగకుండా వెంకటేశ్వరరావు చెప్పినట్లు ఆ దేవుడే చేసి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వెంకటేశ్వరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.