Leading News Portal in Telugu

బీఆర్ఎస్ లో అయోమయం.. కాంగ్రెస్ వైపు స్థానిక నేతల పయనం! | dilemma in brs| local leaders| eye| congress| assembly| defeat| shock


posted on Dec 26, 2023 10:23AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఈ ఎన్నికలలో ఓటమి పాలై విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ కష్టాలు మాత్రం ఇప్పుడే మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత వరుసగా రెండు ఎన్నికలలో విజయం సాధించి 9 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ఒక్క ఓటమితో  కుదేలైపోయింది. భవిష్యత్ లో ఉనికే ప్రశ్నార్థకమౌతుందా అన్న రీతిలో బలహీనపడిపోయింది. నాయకులు పార్టీ అధికారం కోల్పోయిన క్షణం నుంచీ పక్క చూపులు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మల్లారెడ్డి వంటి వారైతే తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని బాహాటంగా మీడియాతోనే చెప్పేశారు. ఇక కొందరు ఎమ్మెల్సీలు.. ఎన్నికలలో పార్టీ ఓటమికి అధినేత విధానాలు, వ్యవహారశైలే కారణమని తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. వెళ్లగక్కుతున్నారు. 

అంతే కాదు.. పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత డొల్లగా ఉందనడానికి సింగరేణి ఎన్నికలలో చేతులెత్తేయడమే నిదర్శనం. మరో మూడు నాలుగు నెలలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన స్థితిలో పార్టీలో అభ్యర్థుల మార్పు అంశం తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులను మార్చకపోవడం వల్ల దెబ్బతిన్నామన్న భావనతో బీఆర్ఎస్ అధినేత లోక్ సభ ఎన్నికలలో సిట్టింగులను మార్చేస్తే చాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అసలు విషయం ఏమిటంటే.. అభ్యర్థుల మీద వ్యతిరేకత ఒక్కటే కాదు.. ప్రభుత్వ పనితీరు మీదా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉండడం వల్లనే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైంది. ఆ విషయాన్ని గమనించకుండా బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల మార్పే విజయానికి తారకమంత్రం అని భావిస్తున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు అయ్యీ అవ్వడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకురానున్నాయి. 

ప్రస్తుతం బీఆర్ఎస్ లో తీవ్ర అయోమయం నెలకొని ఉంది. పార్టీని వీడేందుకు నేతలు రెడీ అవుతుంటే.. స్థానిక నేతలలో అయోమయం నెలకొని ఉంది. ముఖ్యంగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీలో కొనసాగడమా? మారడమా అన్న సందిగ్ధతలో ఉన్నారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ పార్టీగా మనుగడ ఎలా సాగిస్తుందన్న విషయంలో పార్టీ అధినాయకత్వానికే ఒక స్పష్టత లేదన్న భావన కింది స్థాయి నేతలలో నెలకొని ఉంది. ఉద్యమ పార్టీగా మాత్రమే టీఆర్ఎస్ బలంగా ఉందనీ, ఆ తరువాత రాజకీయ పార్టీగా మారిన తరువాత బీఆర్ఎస్ నమ్ముకున్నది అధికారాన్ని మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు ఆత్మ లాంటి తెలంగాణ పదానికి ఆ పార్టీ దూరమయ్యాకా పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు. 

ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ సహా నేతల వరకూ పక్క చూపులు చూస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో అధికారంలో ఉంటే ఎదురే ఉండదన్నట్లుగా వ్యవహరించిన పార్టీ నాయకత్వం కారణంగానే కింది స్థాయి నాయకత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎలా అయితే ప్రత్యర్థి పార్టీల నుంచి క్యాడర్ ను, లీడర్ ను ఆకర్ష్ పేరిట లాగేసుకుందో.. అదే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. 

అంతే కాకుండా రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు కుప్పతెప్పలుగా చేరారు. అలాంటి వారే దాదానె 80శాతం మంది స్థానిక సంస్థలలో ప్రజా ప్రతినిథులుగా ఉన్నారు. అధికారానికి దూరంగా ఐదేళ్ల పాటు స్థానిక సంస్థల ప్రగతి, పురోగతిలో ముందుకు సాగడం కష్టమన్న భావనతో వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితులలో గ్రామీణ స్థాయిలో పట్టు నిలుపుకుని సాగడం బీఆర్ఎస్ కు అంత తేలిక కాదని అంటున్నారు.  

అలాగే ఓటమి షాక్ నుంచి బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఓటమి అనంతరం ఇంత వరకూ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించడం కానీ, వారిలో భవిష్యత్ పట్ల భరోసా కలిగించే ప్రయత్నాలు కానీ జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలు పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయారని, వారంతా పార్టీకి దూరం జరగాలన్న యోచనలో ఉన్నారనీ పరిశీలకులు అంటున్నారు.  

అన్నిటికీ మించి పంచాయతీల్లో చేసిన పనులకు నిధులు మంజూరు కాకపోవడం, ఏకగ్రీవ గ్రామాలకు ప్రోత్సాహకాలు అందకపోవడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న స్థానిక నేతలు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.