Leading News Portal in Telugu

వైసీపీలో ఉంటే మటాష్.. సంక్రాంతి తర్వాత జంపింగులే! | disaccord peaks in ycp| sittings| resign| party| jumpings| afters| sankranti. anna


posted on Dec 27, 2023 1:00PM

2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం గ్యారంటీ. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే  సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత అంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు.  ఇది ఆయనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది.  ప్రజలలో  వైసీపీ సీట్టింగుల మీద కంటే జగన్ పైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తికి, వ్యతిరేకతకు  ఎమ్మెల్యేలు నేతల ఆగ్రహం కూడా తోడైంది. అంతే కాదు.. చాలా మంది సిట్టింగులు వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ మటాషే అని భావిస్తున్నారు. ఈసారి వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, సీట్లు ఇచ్చినా స్థానాల మార్పు జాబితాలో ఉన్న సిట్టింగులు, పార్టీ టికెట్ ఇచ్చినా వైసీపీలో ఉంటే ప్రజలు ఓడించడం గ్యారంటీ అని భావిస్తున్న వారు ఇలా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది.

జగన్ తో అంటకాగి,  వైసీపీలో కొనసాగితే  పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోతుందని భావిస్తున్నారు.  ఈ సారి  తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చేశారు. తెలుగుదేశం ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి , పోలవరం పూర్తి చేసి తీరాలన్న కంకణం కట్టుకుంది. అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించి పూర్తి చేయడం ఖాయం. చంద్రబాబు ట్రాక్ రికార్డు అలాంటిది. ఆయన పట్టుబట్టారంటే చేసి తీరుతారు. సైబరాబాద్ నిర్మాణమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని భావిస్తున్న వైసీపీ అసంతృప్త నేతలు..  వైసీపీలో ఉండడం అంటే చేజేతులా రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకోవడమే అని భావిస్తున్నారు. జగన్ కు దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనలలో ఏదో పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. ఆయా పార్టీలలో టికెట్ దక్కకపోయినా ఫరవాలేదు, చేర్చుకుంటే చాలని అనుకుంటున్నారు.  

ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం, జనసేన పార్టీలతో టచ్ లో ఉండగా.. మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గతంలో  తెలుగుదేశంతో అనుబంధం ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతుంటే.. పాత కాంగ్రెస్ నేతలు మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ పెద్దలు ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో బుజ్జగింపులు జరుపుతుండగానే.. వారిలో కొందరు బహిరంగంగానే వైసీపీకి రాంరాం చెప్పేస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌లు ఇప్పటికే తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు,  పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన గూటికి చేరనున్నారు. మరో ఎమ్మెల్యే కూడా తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు  ప్రకటించేశాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేమని చెప్పేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని గిద్దలూరు పంపించాలని వైసీపీ ప్రయత్నిస్తున్నది. కానీ అందుకు బాలినేని ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఆయన ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. జగన్ అందుకు అవకాశం ఇవ్వకుంటే  ఆయన  వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు జిల్లా రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది.

ఇక గిద్దలూరు నుండి టికెట్ లేదని జగన్ ఖరారు చేసేయడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రాంబాబు తన దారి తాను చూసుకుంటున్నట్లు ప్రకటించారు.  ఇప్పటికే తన కార్యకర్తలు, ఆంతరంగీకులతో సమావేశం నిర్వహించిన రాంబాబు. జగన్ పెత్తందారీ పోకడలతో వేగలేనని ఆ సమావేశంలో చెప్పేశారటి.  రాష్ట్రంలోనే అత్యధిక  మెజారిటీ(80000)తో గెలిచిన తనను జగన్ ఆయన సామాజిక వర్గం కాదన్న ఏకైక కారణంతో ఇంత కాలం అణగతొక్కేశారని, నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఏమీ చేయలేపోయానని, ఇకపై వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని కార్యకర్తల, ఆంతరంగికుల సమావేశంలో విస్పష్టంగా చెప్పేశారనీ, అంతే కాకుండా తన రాజకీయ జీవితం  తెలుగుదేశంతోనే మొదలైందనీ, పార్టీ మారి తప్పు చేశానని ఇప్పుడు భావిస్తున్నానని చెప్పారు.  తాను వైసీపీని వీడటం ఖాయమని, జిల్లా నుంచి వైసీపీకి రాజీనామా చేసే తొలి సిట్టింగ్ ఎమ్మెల్యే తాను ఔతానని ఆయన ఆ సమావేశంలో చెప్పారు.  సంక్రాంతి తరువాత తెలుగుదేశంలో చేరుతానని ప్రకటించేశారు. తెలుగుదేశంలో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోయినా.. ముందుముందు రాజకీయ భవిష్యత్ ఉంటుందనీ,  అదే వైసీపీలో ఉంటే రాజకీయంగా మటాష్ అయిపోవడమేనని ఆయన చెప్పారని ఆయన ఆంతరంగికులు, కార్యకర్తలు తెలిపారు. 

ఒక్క రాంబాబు మాత్రమే కాదు.. వైసీపీ నుండి 40 మంది ఎమ్మెల్యేలది ఇప్పుడు అదే పరిస్థితి. వైసీపీలో ఉంటే భవిష్యత్ అనేది లేదు. టీడీపీ-జనసేనలో టికెట్ ఇవ్వకపోయినా పరవాలేదు.. ముందైతే వైసీపీని వీడి వెళ్లిపోవాలన్నదే ఇప్పుడు ఎమ్మెల్యేల ఆలోచన. అందుకోసం ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా.. సంక్రాంతి తర్వాత ఈ వలసలు భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. నిజానికి గిద్దలూరులో వైసీపీతో పాటు అన్న రాంబాంబుపై కూడా ప్రజలలో భారీ స్థాయిలో అసంతృప్తి ఉంది. అలాంటి ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉండలేమని ఫిక్సయిపోయారు. కాస్తో కూస్తో పనిచేసిన వారు.. కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన వారిని కూడా జగన్ నియోజకవర్గాలను మార్చేయడంతో ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి భారీ సంక్షోభం తప్పేలా కనిపించడం లేదు. జనవరిలో ఏ రోజు ఈ సంక్షోభం బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనని రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేగుతుంది.