షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ పిలుపు.. జగన్ ఇక సర్దేసుకోవడమేనా? | congress hi command call sharmila to delhi| ap| politics| key| responsibilities| jagan| party
posted on Dec 27, 2023 12:28PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆ విషయంపై అటు షర్మిల నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు కట్టబెడతారని రాజకీయవర్గాలలో గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ ఎంట్రీకి సంబంధించిన చర్చలు నెలల కిందటే మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఆ దిశగా చర్చలు సాగాయి. కొంత మేర పురోగతి కూడా సాధించాయి. ఆ కారణంగానే షర్మిల తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతుగా తన వైఎస్సార్టీపీని పోటీ కి దూరంగా ఉంచారు.
ఆ సమయంలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. షర్మిల కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి కార్యరూపం దాల్చబోతున్నాయి. షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. అది కూడా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై హస్తినలో కీలక చర్చలు జరుగుతున్న వేళ షర్మిలకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారన్న వార్తలకు ఈ పిలుపు బలం చేకూర్చింది.
కాంగ్రెస్ లోకి షర్మిల చేరిక, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఆమె పాత్ర తదితర అంశాలపై కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలతో చర్చించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడమే కాకుండా, పార్టీ పగ్గాలు కూడా అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలు బుధవారం (డిసెంబర్ 27)న హస్తినలో కాంగ్రెస్ హై కమాండ్ తో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తు తదితర అంశాలపై చర్చించారు. సరిగ్గా ఈ సమయంలోనే హై కమాండ్ నుంచి షర్మిలకు పిలుపు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరించడమంటూ జరిగితే.. వైసీపీ పని అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.