Leading News Portal in Telugu

నాడు తండ్రి బోధన్ షకీల్   నేడు కొడుకు సాహిల్  | MLA Shakeels son booked| for destroying barricades at Praja Bhavan ap news| ts news


posted on Dec 28, 2023 12:11PM

గత నెల 30 వ తేదీన తెలంగాణ ఓటర్లు స్పష్టమైన తీర్పు చెప్పారు. పదేళ్లు అధికారంలో అధికారంలో ఉన్న కెసీఆర్ ప్రభుత్వానికి సన్నాయి నొక్కులు నొక్కిన అధికార యంత్రాంగం అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా  బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేష్టలు చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది.  

మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్ కి పరారైనట్టు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. నిన్న లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

మరోవైపు, సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు రూ. 20 నుంచి రూ. 25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా, ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, కేసు నుంచి నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.

2007లో షకీల్  నకిలీ పాస్ పోర్ట్ కేసులో మోస్ట్ వాంటెడ్ పర్సన్. మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్ పోర్ట్ కేసులో షకీల్ కీలక పాత్ర పోషించాడు. అమెరికాతో సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో గుజరాతీయులు ఆయా దేశాలకు వెళ్లడానికి ప్రజా ప్రతినిధులను కల్సి నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేయించుకునే వారు. ఢిల్లీ ఎంపీ బాబు భాయ్ కొటారా ఈ స్కాంలో చిక్కుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రతినిధుల కుటుంబసభ్యులుగా గుజరాతీయులు పాస్ పోర్ట్ చేసుకుని ఆయా దేశాలకు చెక్కేసేవారు. షకీల్ కూడా గుజరాతీయులు తన కుటుంబసభ్యులు అని నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేయించాడు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు తీవ్రంగా గాలించిన తర్వాత షకీల్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల రికార్డుల్లో కూడా బోధన్ షకీల్ అని ఉంటుంది. 

ప్రజా భవన్ వద్ద జరిగిన ప్రమాదంతో  నిరుడు జూబ్లిహిల్స్ యాక్సిడెంట్  మళ్లీ తెరపైకి వచ్చింది. 

2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు  కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లిహిల్స్ వైపు వచ్చిన  థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్ , సుశ్మ భోస్లే తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాజల్ చౌహాన్ రెండునెలల కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. 

 థార్ కారుపై బోధన్ ఎంఎల్ఏ స్టిక్కర్  ఉండటంతో వివాదానికి దారితీసింది. షకీల్ కుమారుడు సాహిల్ రాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగిందని ప్రచారం జరిగింది.  ఈ నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ పై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో సోషల్ మీడియాకు షేర్ చేశాడు. ఈ కారును తాను అప్పుడప్పుడు మాత్రమే వాడతానని, తన కజిన్  ఎక్కువగా వినియోగిస్తాడని కట్టు కథ అల్లాడు. తన కొడుకుకు ఈ యాక్సిడెంట్ తో ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. గాయ పడిన వారికి, మృత చెందిన అబ్బాయికి నష్ట పరిహారం ఇవ్వాలని కజిన్ కు చెప్పినట్లు షకీల్ ఆ వీడియో సందేశంలో కోరాడు. ఈ యాక్సిడెంట్ బాధాకరమని షకీల్ మొసలి కన్నీరు కార్చాడు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.  ప్రజా భవన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో  కూడా తన వద్ద పని చేసే వాళ్ల పని అని బుకాయించాడు.  పంజాగుట్ట ఇన్ స్పెక్టర్  కూడా సాహిల్ కు ఎటువంటి సంబంధం లేనివిధంగా ఎఫ్ ఐ ఆర్  నమోదు చేశాడు. షకీల్ ఒత్తిడి మేరకు ఇన్ స్పెక్టర్ యాక్సిడెంట్ కేసు సాక్షులను తారు మారు చేసే ప్రయత్నం చేసినట్లు రుజువు కావడంతో  ఉన్నతాధికారులు సస్పెండ్  చేశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో  జూబ్లిహిల్స్ కారు  ప్రమాద కేసును పోలీసులు తిరగ తోడుతున్నారు. సా హిల్ కు ఈ ప్రమాదంతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పశ్చి మండల డిసిపి మీడియాకు వెల్లడించారు.