Leading News Portal in Telugu

సార్వత్రిక ఎన్నికల భయం.. బీజేపీతో దోస్తీకి కేసీఆర్ తహతహ | general elections fear| kcr| eager| friendship| modi| hidutva| ajenda| kavita


posted on Dec 29, 2023 3:33PM

ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి  అన్న సుమతీ శతకంలోని పద్యంలా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన రాజకీయ లబ్ధి కోసం అవసరానికి మాటలు మార్చేస్తుంటారు. నిన్నటి వరకూ నిప్పులు చెరిగిన నేతలనే  నేడు పొగడ్తల వర్షంలో ముంచెత్తిస్తూ ఉంటారు. నిన్న ఔనన్న మాటని ఏ మొహమాటం లేకుండా నేడు కాదని చెప్పేస్తారు. ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాలు, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తొలి ప్రధాని దళితుడే అన్న మాటలను ఆ తరువాత మరెన్నడూ ఆయన కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. 

ఇక ప్రస్తుతానికి వస్తే గత రెండున్నర మూడేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలు పెట్టి ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి మోడీ అనర్హుడు, ఆయనను గద్దె దించి ఇంటికి పంపిస్తానని కూడా అన్నారు. బీజేపీనీ బంగాళాఖాతంలో కలిపేస్తానని కూడా అన్నారు. ఈ విమర్శల వెనుక రాజకీయ వ్యూహాలు ఏమైనా కావచ్చు కానీ ప్రధాని హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీకి  ఆయన మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడానికి   కూడా కూడా ఇష్టపడలేదు.  

 సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత  ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నెలల వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలలో కనీస స్ధానాల కోసం ఆయన బీజేపీ పంచన చేరడానికి అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నుతున్నారు. వాటిలో భాగంగానే నిన్న మొన్నటి వరకూ బీజేపీపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎజెండా హిందుత్వను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత సనాతనధర్మానికి, హిందువులకి  వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తుంటే.. ఆమె సోదరుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అయితే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ప్రకటించేశారు.  

ఇదంతా బీజేపీకి దగ్గరవ్వడానికీ, మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకొనేందుకూ  కేసీఆర్ తెరవెనుక ఉండి పన్నుతున్న వ్యూహంలో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సారథ్యంలో బీజేపీ గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందన్న సర్వేల నేపథ్యంలోనే  కేసీఆర్ బీజేపీకి దగ్గరకావడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ అంతే రాజకీయ లబ్ధి కోసం అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనుకాడరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం ఎన్నికల భయమే కాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు భయం కూడా తోడవ్వడంతో  మోడీని శరణువేడటం తప్ప మరో గత్యంతరం లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.