posted on Dec 29, 2023 11:17AM
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు. వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఈనెల 24న ‘వ్యూహం’ సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్క గురించి వర్మ చెబుతూ.. ‘బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమాను ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.
నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేయడానికి బర్రెలక్క కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతంగా ప్రచారం లభించింది.ఈ ఎన్నికలలో బర్రెలక్క ఫేమస్ అయినప్పటికీ ఓట్ల రూపంలో బర్రెలక్కకు స్పందన రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి గెలుపొందారు. ఈ ఎన్నికలలో జన సేన పార్టీ కూడా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఎపి ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా వ్యూహం సినిమాకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ బర్రెలక్కను కొనియాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జన సేనానికి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన బర్రెలక్క రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలను ఖండించారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని పేర్కొన్నారు. తాజాగా వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై బర్రెలక్క సీరియస్ అయ్యింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపావర్మ సినిమాలకు దర్శకుడిగా తొలిచిత్రం శివ తర్వాత మరే చిత్రానికి అంత పేరు రాలేదు. ఆయన తన సినిమాల్లో హింస, అశ్లీలం జొప్పించి విమర్శలు మూట గట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో రాజకీయ బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ తన చిత్రాలకు మైలేజ్ వచ్చే కామెంట్స్ చేస్తున్నారు. నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ తన ప్రయోజనాల కోసం నిరుద్యోగ సమస్య మీద పోటీ చేసిన బర్రెలక్క ను ప్రశంసించే బదులు ఆమెను చులకన చేసే వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు.