Leading News Portal in Telugu

జనసేనాని పోటీ కాకినాడ సిటీ నుంచేనా? | pawan to contest from kakinada city| tdp| janasena| alliance| ycp| dwarampudi


posted on Dec 29, 2023 9:08AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. తన వాణిని బలంగా అసెంబ్లీలో వినిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. జగన్ సర్కార్ అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాలు, అవినీతిపై బలంగా గొంతు వినిపిస్తున్న పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీ లబ్ధి చేకూరడానికి తాను ఎంత మాత్రం తావివ్వనని ప్రతినపూనారు. 

ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. క్షేత్ర స్థాయి నుంచీ జనసైనికులు ఎటువంటి పొరపచ్చాలూ లేకుండా తెలుగుదేశంతో కలిసి నడవాలని పిలుపు నిచ్చారు. ఆయన సైతం చంద్రబాబుతో కలిసి బహింరగ సభలలో పాల్గొంటున్నారు. యువగళం ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు సైతం హాజరయ్యారు. ఇక జనసేన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే స్థానం ఏదన్న విషయంపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. గాజువాక, తిరుపతి, ఉభయగోదావరి జిల్లాలలోని ఏదో ఒక నియోజకవర్గం, తిరుపతి ఇలా చాలా చాలా ఆప్షన్స్ పై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. అయితే జనసేనాని తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

పొత్తులో భాగంగా జనసేన గోదావరి జిల్లాలలోనే ఎక్కువ స్థానాలలో పోటీకి దిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అక్కడ అయితే సామాజిక వర్గ సమీకరణాలతో పాటు, పవన్ కు అభిమానుల సంఖ్య కూడా అధికంగా ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారన్న అంచనాలకు బలం చేకూర్చే విధంగా ఆయన ఇటీవల మూడు రోజుల పాటు కాకినాడలో బసచేసి సమీక్షలు నిర్వహించనున్నారు.  బలం ఉన్న చోటే తాను పపోటీ చేస్తానని, అలాగే పొత్తులో భాగంగా గెలుపు గ్యారంటీ ఉన్న సీట్లనే కోరుతాననీ పవన్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే   పలు సర్వేలు నిర్వహించిన అనంతరం వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చిన పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా క్యాడర్ ను రెడీ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నిటికంటే ముందు తాను పోటీ చేయబోయే స్థానం విషయంలో క్యాడర్ కు ఒక స్పష్టత ఇవ్వాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. కాకినాడ అయితే సామాజికవర్గ మద్దతుతో పాటు.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి  సవాల్  ను స్వీకరించినట్లూ ఉంటుందని పవన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి సీఎం జగన్  నమ్మినబంటుగా గుర్తింపు ఉంది.

అంతే కాక ద్వారంపూడి గతంలో  పవన్ పై   అనుచిత వ్యాఖ్యలతో  ఇంకా చెప్పాలంటే బూతులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో  తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ కూడా చేశారు. అప్పట్లో వ్యూహాత్మక మౌనం పాటించిన పవన్  ఇప్పుడు ద్వారంపూడిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే పవన్ కల్యాణ్  మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కాకినాడలో మకాం వేసి పరిస్థితిని సమీక్షించి, పార్టీని సమాయత్తం చేసి అక్కడ నుంచే పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ద్వారంపూడిని ఓడిస్తే జగన్ ను ఓడించినట్లేనని జనసేన వర్గాలు అంటున్నాయి.  కాకినాడ సిటీ నుంచి పవన్ పోటీలోకి దిగితే జరిగేది అదేనని కూడా చెబుతున్నాయి.