షర్మిలతో సంధికి వైసీపీ యత్నాలు? | ycp efforts for truce with sharmila| ys| family| pride| kadapa| mp| seat| political
posted on Dec 31, 2023 3:26PM
ఏపీలో కొత్త ఏడాదిలో కొత్త రాజకీయాలు మొదలు కానున్నాయా అంటే అన్ని వర్గాలు అవుననే ముక్తకంఠంతో చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలోఅసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలూ జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జనవరి నుండే సన్నాహాలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. జనవరిలో దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అయితే, ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఒకవైపు, ప్రతిపక్షంలో తెలుగుదేశం.జనసేన మరోవైపు బరిలో నిలవనుండగా.. కాంగ్రెస్ కూడా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖరారైంది. జనవరి మొదటి వారంలోనే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైపోయింది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని చెబుతున్నారు.
షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా జగన్ కు పెద్దగా నష్టం లేకుండా పోయింది. కానీ, ఆమె ఏపీకి వస్తే జగన్ కు భారీ డ్యామేజ్ జరగడం ఖాయం. ఇది వైసీపీకి తీరని నష్టంగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాదు, ఒకే రాష్ట్రంలో రెండు వేరువేరు పార్టీలలో ఉంటూ.. అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా అది జగన్ ప్రతిష్టను మరింత మసకబారుస్తుందని అంటున్నారు. పైగా షర్మిల తన రాజకీయ ప్రయాణంలో జగన్ పై సూటిగా విమర్శలకు దిగితే వైఎస్ కుటుంబంలో వివాదాలు కూడా బహిర్గతం కావడం ఖాయం. ఇవన్నీ రానున్న ఎన్నికలలో వైసీపీకి ఘోర ఓటమికి కారణం కావడమే కాకుండా.. జగన్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొనే షర్మిల కోసం జగన్ అండ్ కో రాయబారాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. వైసీపీలోకి తిరిగి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్త వైరల్ అవుతోంది. వైఎస్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు వైసీపీ తరఫున షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. షర్మిలకు ఏం కావాలి? ఆమె ఆలోచనలు ఏంటి? ఆమె డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుని మళ్ళీ అన్న జగన్ తో రాజీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా సదరు రాయబారే తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, వైసీపీ నుండి కడప ఎంపీగా షర్మిలను పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని, ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడం, ఆస్తులకు సంబంధించిన విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి షర్మిలతో సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే జగన్ నైజం తెలిసిన వారెవరూ ఆయన అంత సులభంగా రాజీకి వచ్చే మనిషి కాదనే అంటారు. అదే విధంగా షర్మిలకు కూడా అన్న జగన్ తో రాజీకి వచ్చే అవకాశాలు లేవనీ, తెలంగాణలో అడుగడుగునా ఇబ్బందులు సృష్టించడమే కాకుండా, షర్మిలకు ఆర్థికంగా ఇసుమంతైనా సహకారం అందకుండా జగన్ చేశారనీ, అందుకే ఆమె ఏపీకి వచ్చి అన్నతో తలపడేందుకు సిద్ధమయ్యారనీ అంటున్నారు. కనుక షర్మిల అన్నతో రాజీపడే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. అసలు ఈ ప్రచారాన్ని జగన్ అభిమానులే సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై.. మళ్ళీ అన్నా చెల్లెల్లు ఒక్కటి అవుతారనేందుకు ఉన్న ఏకైక పాజిటివిటీ ఏదైనా ఉందంటే అది తల్లి విజయమ్మ మాత్రమే. ఎంతైనా తల్లి కదా మళ్ళీ అన్నా చెల్లెల్లు కలిస్తారంటే తల్లిగా ఆమె పాత్ర ఆమె నిర్వర్తిస్తారు. ఇద్దరినీ ఉన్నతంగా చూడాలన్నదే ఆమె కోరిక కనుక ఆ అవకాశం వస్తే విజయమ్మ ఇందులో కీలకం కానున్నారు. కానీ, జగన్ అంత సులభంగా కరుగుతారా? ఒకేవేళ చెల్లే కదా అని జగన్ తగ్గినా.. వదిన భారతీ అందుకు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.