అప్పుల ఊబిలో భారత్.. దివాళా దిశగా అడుగులు? | india in debt quicksand| lacks| crores| infrastructur| employment| oppotunities| income| taxes| imf
posted on Jan 4, 2024 1:34PM
భారత్ వెలిగిపోతుందా నిజంగా అంటే నిస్సందేహంగా లేదు. ఎందుకంటే భారత దేశ జనాభా 140 కోట్లు ఉంటే.. దేశం అప్పు మాత్రం రూ. రూ.200 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చన్నది ఒక అంచనా. ఈ అప్పుల వ్యవహారంలో 70 ఏళ్ల భారత దేశ చరిత్ర అంతా ఒక లెక్క అయితే ఈ గడిచిన తొమ్మిదిన్నరేళ్ల చరిత్ర ఇంకొక లెక్కగా చెప్పుకోవాలి. ఎక్కడైనా అప్పు ఇచ్చేవారు నీ బాకీ పెరిగిపోతోందని మనల్ని హెచ్చరించారంటే దాని లెక్క దానికి ఉంటుంది. అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ప్రతినిధులు కూడా దాదాపు ఏటా ఒక సారి దేశ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసి ఒక నివేదిక ఇస్తారు. అయితే, ఈసారి ఈ నివేదికలో హెచ్చరిక వుంది. గతంలో ఎన్నడూ ఇలాంటి హెచ్చరిక లేదు. ఈసారి మాత్రం గట్టి హెచ్చరికే కనిపించింది. ఇదే ప్రతికూల ఆర్థిక పరిణామాలు కొనసాగితే 2027-28 నాటికి భారత రుణం జీడీపీలో 100 శాతం, లేదా అంతకు మించి ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ అంచనాను మన ప్రభుత్వం తోసిపుచ్చినా ఆర్ధిక నిపుణులు మాత్రం ఇది తీవ్రాతి తీవ్రమైన హెచ్చరికగానే పేర్కొంటున్నారు.
భారత రుణ భారంపై ఇటీవల చర్చ కూడా జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్ప చేసిందనే విమర్శ కూడా పెద్ద ఎత్తున వినవస్తున్నది. ప్రధాని మోడీ తొలి సారి అధికార పగ్గాలు చేపట్టే నాటికి అంటే 2014 మార్చి నాటికి దేశ అప్పు రూ. 53 లక్షల 11 వేల 81 కోట్లు. అయితే ఇప్పుడది రూ. 155.6 లక్షల కోట్లు. అంటే ఈ తొమ్మిదేళ్లలో దేశం రుణం మూడింతలు పెరిగింది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు 10 లక్షల కోట్లపై మాటే. ఇక తెలంగాణ రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు. ఈ లెక్కన దేశంలో మిగిలిన రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఏంటి? అసలు ఇబ్బడిముబ్బడిగా తీసుకొస్తున్న ఈ అప్పులకి లెక్కలు ఉన్నాయా? అసలు ఈ అప్పుల ఘనత ఎవరిది? ఏం చూసి ఇంత అప్పు చేస్తున్నారు? ఎక్కడ నుండి పుడుతున్నది ఇంత అప్పు? ఎందుకోసం చేస్తున్నారు? ఎవరు తీర్చాలి? సామాన్య ప్రజలా.. పాలకులా? దేశం మీద అంతో ఇంతో ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి.
ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు కదా పోనీ ఏం ఒరగబెట్టారు అంటే.. ఏం లేదనే సమాధానమే వస్తోంది. తెచ్చిన అప్పులు కనిపిస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ కనిపించడం లేదు. దేశం ఇంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయినా ప్రజల సౌకర్యాలు పెరగలేదు.. ఆదాయం పెరగలేదు.. సంపద పెరగలేదు.. ఉపాధి పెరగలేదు. కనీసం ఉపాధి అవకాశాలను మెరుగు పడలేదు. చెప్పుకో తగ్గ పరిశ్రమలు రాబట్టిందీ లేదు.. విద్యా, వైద్య రంగంలో గుణాత్మక మార్పులూ రాలేదు. పేరుకు దేశమంతా ఉచిత వైద్యం ఉన్నా.. అది ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు లేవు. నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ధరలు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయాయి. కొత్తగా ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన దాఖలాలు లేవు. పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు. అవి కాకుండా మిగిలినవేమైనా ఉంటే అవి దివాళాకు చేరువలో ఉన్నాయి.
ఎగువ మధ్య తరగతికి సౌకర్యాలు పెరిగాయి తప్ప రైల్వేలో సామాన్యుడికి బోగీల సంఖ్య పెరిగలేదు. టోల్ టాక్స్ లు తగ్గించలేదు. ఇంత అప్పులు చేసినా దేశంలో పేదరికం తగ్గలేదు. మధ్య తరగతి అనే పదం రూపు మాసిపోలేదు. ధనిక వర్గాల దగా దోపిడీ ఆగలేదు. వందలు వేల కోట్లలో అప్పులు తీసుకొనే బడా పారిశ్రామిక వేత్తలు మళ్ళీ ఆ అప్పులు తిరిగి కట్టకపోగా మళ్ళీ వారికే బ్యాంకులు అప్పలు ఇస్తున్నాయి. కానీ, ఆరుగాలం శ్రమించే రైతులకు హామీలు లేకుండా అప్పులు పుట్టడం లేదు. నిర్మాణ రంగం, ఉపాధి రంగం నిలదొక్కుకున్నది లేదు. కనీసం అందులో కార్మికులకు భరోసా లేదు. కానీ, ప్రభుత్వాలు మాత్రం అన్ని రంగాల్లో ముందున్నాం అంటూ ఘనంగా చెప్పుకుంటోంది. నిజంగా అన్ని రంగాల్లో ముందుంటే దేశం ఇంతగా అప్పుల్లో ఎందుకు కూ రుకుపోయింది? ఆయా రంగాల నుండి ఉత్పత్తి అవుతున్న సంపద ఏం అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడే కనిపించడం లేదు. సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోడీ మౌనముద్ర మాటున దాక్కుంటున్నారు. విపక్షాలను విమర్శించడానికి, తన ఘనతలను చాటుకోవడానికీ తప్ప, కీలకమైన ఏ అంశంపైనా ఆయన నోరు పెగలదు, నోట మాట రాదు.
ఇక దేశం ఇంతగా లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటే దేశం వృద్ధి రివర్స్ గేర్ లో ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే పాలకులు చెప్పే, చేపే సంపద ఎక్కడిది? విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టపడి చెమటోడ్చి ఏటా ఒక 10 లక్షల కోట్లు తమ తల్లి తండ్రులకి పంపిస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ భూములు స్థిరాస్తులు కొంటున్నారు. దానివలన చుట్టు పక్కల ఉన్న భూములు ఆస్తుల విలువ పెరిగి కాస్త స్థిరంగా ఉంటున్నది. విదేశాల్లో ఉన్న వాళ్లు ఇక్కడికి సొమ్ము పంపుతుంటే.. దేశంలో ఆ ఎకానమీ చూపించి నేతలు, పాలకులు ఇదంతా తమ గొప్పే, తాము సాధించిన అభివృద్ధే అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ఎకానమీలో జెనరేట్ అయిన సొమ్మును జనాలకి ఉచిత పథకాల పేరుతో పంచుతూ పన్నుల రూపంలో తిరిగి ప్రజల నుండే గుంజుతున్నారు. నిజంగా దేశం అభివృద్ధి చెందుతూ సంపదతో విరాజిల్లుతుంటే ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు లాంటివి పెరగాలి. కానీ అవి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. పాలకులు కూడా ఏం చేయాలో అది చేయడం మానేసి.. ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నది మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం అన్న తేడా ఇసుమంతైనా లేదు. అందరిదీ ఇదే దారి. ముఖ్యంగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తరువాతే దేశంలో ఆర్థిక అరాచకత్వం పెట్రేగిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్ ని అప్పు అనే అనకొండ మింగేయడం గ్యారంటీ.
-జ్వాల