కాళేశ్వరం బిల్లుల చెల్లింపు నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం | kaleswaram bills payment stopped| revanth| sarkar| sensational
posted on Jan 4, 2024 2:31PM
కాళేశ్వరం బిల్లుల చెల్లింపు నిలిపివేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం మొదటి లింకులోని మూడు బ్యారేజీల బిల్లుల చెల్లింపులను పెండింగ్ లో ఉంచాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగడం, సుందిళ్ల బ్యారేజికి సంబంధించి సమస్యలు ఉన్నాయంటూ నేషనల్ సేఫ్టీ డ్యాం అధికారులు పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ సంబంధిత బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజి పనులు చేసిన ఎల్అండ్ టీకి రూ.400 కోట్లు, అన్నారం బ్యారేజీ పనులు చేసిన అప్కాన్స్ సంస్థకు రూ.161 కోట్లు, సుందిళ్ల బ్యారేజీ పని చేసిన నవయుగకు కూడా తుది బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.
అన్నారం పంపు హౌస్ మరమ్మతులకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్‌కు రూ.74 కోట్లు బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయం తర్వాతే మూడు బ్యారేజీలకు సంబంధించిన బిల్లులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.