posted on Jan 4, 2024 3:50PM
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యరు.
దీంతో వారిరువురూ తమతమ ఎమ్మెల్సీ సభ్యత్వానికి చేసిన రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆ రెండు స్థానాలకూ ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి కడియం, కౌశిక్ రెడ్డిల ఎమ్మెల్సీ గడువు 2027 నవరంబర్ 30 వరకూ ఉన్నప్పటికీ వారు రాజీనామా చేయడంతో ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఈ నెల 11 రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమౌతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జనవరి 18 కాగా, జనవరి 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జనవరి 22 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ఇక జనవరి 29న పోలింగ్ జరగనుంది.