Leading News Portal in Telugu

మైనర్ పై వర్చువల్ గ్యాంగ్ రేప్! | virtual gang rape| online| game| show| avatar| charecter| first| world| police


posted on Jan 4, 2024 1:58PM

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇది మన రాష్ట్రం, దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలూ పెరిగిపోతున్నాయి.   ప్రపంచవ్యాప్తంగా ఈ నేరాలపై కఠిన శిక్షలు అమల్లో ఉన్నా  మృగాళ్లలో మార్పు రావడం లేదు. అయితే  భౌతిక అత్యాచారాలే కాదు.. ఆన్ లైన్  వర్చువల్ అత్యాచారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ వర్చువల్ సమావేశాలు, వర్చువల్ ప్రోగ్రామ్స్, వర్చువల్ ప్రారంభోత్సవాలు మాత్రమే మనకు తెలుసు. దిగ్భ్రాంతి గొలిపే విధంగా ప్రపంచంలోనే తొలి సారిగా వర్చువల్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ పదహారేళ్ల బాలిక ఫిర్యాదుతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.  యూకేలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రపంచంలోనే ఈ తరహా తొలి కేసుగా నమోదైంది.  16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్‌లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దర్యాప్తు సాగుతోంది. ఆ బాలిక వర్చువల్ రియాలిటీ గేమ్‌ ఆడుతుండగా.. తన డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

నిజానికి ఆ బాలిక గేమ్ అడుగుతున్న సమయంలో మానసికంగా డిజిటల్ అవతార్ లోకి లీనం అయ్యింది. అపరిచిత వ్యక్తులు ఆమె డిజిటల్ అవతార్ పై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక తనపై నిజంగానే లైంగిక దాడి జరిగినట్లు భావిస్తూ.. తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్లు ది న్యూ యార్క్ వార్తాసంస్థ పేర్కొంది. టీనేజ్ బాలికలపై ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ కూడా ఈ టీనేజ్ అమ్మాయి ఆన్‌లైన్ గేమ్‌లో మునిగితేలుతుండగా, కొందరు వ్యక్తులు వర్చువల్ గాఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రియాలిటీలో బాలికపై అసలు అత్యాచారం జరగలేదు, బాలికకు ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కానీ, ఆమె అత్యాచారానికి గురయ్యాన్న మానసిక వేదనకు గురవుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ప్రపంచంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ రేప్ క్రైమ్ కేసు ఇదే.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులలో ఒకరు మాట్లాడుతూ.. బాలికపై శారీరకంగా అత్యాచారం జరగకపోయినా.. మానసికంగా ఆమె లైంగిక దాడికి గురైనట్లు భావిస్తుండడంతో చాలా బాధ పడుతుందని పేర్కొన్నారు. ఈ దాడి తనను చాలా కాలం పాటు ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇలాంటి కేసులపై నిర్దిష్టమైన చట్టాలు లేవు. అసలు ప్రపంచంలోనే ఇది తొలికేసు కావడంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆ బాలిక ఏ గేమ్‌ ఆడుతోందనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఈ కేసు దర్యాప్తుతో వర్చువల్ నేరాలు కొనసాగాలా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న చట్టాల ప్రకారం చూస్తే ఆమెపై దాడి జరగలేదు.. కానీ, బాలికకు అన్యాయం జరిగింది.. మానసికంగా దాని తాలూకు క్షోభకూడా అనుభవిస్తుంది. కనుక ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాల్సి ఉంది. మరి ఈ కేసును ఎలా విచారించనున్నారన్నది ముందు ముందు తెలుస్తుందని చెప్పారు.

ఇక ఈ వర్చువల్ రేప్ ఉదంతంపై యూకే హోంశాఖ కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ.. బాలిక లైంగిక వేధింపులకు గురైందన్నారు. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని చెప్పాడు. అయితే హారిజోన్ వరల్డ్‌లో వర్చువల్ సెక్స్ నేరాలపై అనేక నివేదికలు ఉన్నాయి. ఇది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, దీనిపై మెటా కూడా స్పందించింది. మా ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, మా వినియోగదారులకు ఆటోమెటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంచుతుందని మెటా ప్రతినిధి చెప్పారు. దీంతో అసలు ఈ కేసు దర్యాప్తు సాగుతుందా? వర్చువల్ నేరగాళ్లకు శిక్ష పడుతుందా? ఇలాంటి వాటి కోసం కొత్త చట్టాలను ఏమైనా తీసుకొస్తారా? అసలు ఆ బాలికకు న్యాయం జరుగుతుందా అన్న దానిపై యావత్ ప్రపంచ టెక్నాలజీ నిపుణులతో ఆసక్తి కనిపిస్తుంది. మరి యూకే ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.