posted on Jan 6, 2024 11:51AM
విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టిడిపికి గుడ్ బై చెప్పడంతో వచ్చే లోకసభ ఎన్నికలలో అభ్యర్థి ఎవరు అనే అంశం తెరమీదకు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ కీలక స్థానం. సిట్టింగ్ ఎంపీగా ఆయన వరుసగా రెండు పర్యాయాలు కొనసాగి సడెన్ గా పార్టీని వీడటం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివాదానికి కేంద్ర బిందువైన కేశినేని చిన్నికి విజయవాడ టికెట్ వస్తుందని భావిస్తున్నప్పటికీ అసలు విషయం మరోలా ఉంది. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టిడిపి నుంచి పోటీ చేయవచ్చని వినిపిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ఆమోదించడంతో లగడపాటి తీవ్ర మనస్థాపం చెందారు. సమైక్య రాష్ట్రం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో లగడపాటి రాజగోపాల్ రాజకీయాలను త్యజించే స్థాయికి నిర్ణయం తీసుకున్నారు. పదేళ్ల పాటు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో నెంబర్ టూ గా ఉన్నపర్వతనేని ఉపేంద్ర అల్లుడైన రాజగోపాల్ కు టికెట్ ఇవ్వొచ్చు అనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్ చాలాకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన జాతీయ స్థాయిలో సర్వే సంస్థను నెలకొల్పి ఏ పార్టీ అధికారంలో వచ్చేది సరిగ్గా చెప్పేవారు. లగడపాటి ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజమయ్యేవి. లగడపాటి సర్వే సంస్థ దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ 2019 ఎన్నికల సమయంలో రివర్స్ కావడంతో చేసేదేమిలేక మిన్నకుండిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉన్న రాజగోపాల్ సర్వేలు చేయడం కూడా మానేశారు. అంతకుముందు హైద్రాబాద్ లో ఉన్న ఈ సర్వే సంస్థ కార్యాలయం మూత పడింది. ఆయన వ్యాపారం నిర్వహిస్తున్న ల్యాంకో టెక్ కార్యాలయం ఢిల్లీకి షిప్ట్ అయ్యింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి అయిన లగడపాటి కార్యాలయాల మీద తెలంగాణ ఉద్యమకారులు తరచూ దాడులు చేయడంతో ఇక్కడి నుంచి మార్చాల్సి వచ్చింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో లగడపాటి రాజగోపాల్ కు గట్టి పట్టు ఉంది. 1984లో పర్వతనేని ఉపేంద్ర టిడిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రధాని విపి సింగ్ హాయంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. టిడిపిని వీడిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు పర్యాయాలు విజయవాడ పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. ఉపేంద్ర కూతురును వివాహం చేసుకున్న లగడపాటి మామ వారసత్వంగా కాంగ్రెస్ లో చేరారు. విజయవాడ ఎంపీగా గెలిచిన లగడపాటికి గట్టిపట్టు ఉంది. భౌగోళికంగా నే కాకుండా విజయవాడ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయన కు టిడిపి టికెట్ ఇవ్వొచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.