కేశినేని నాని రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం!? | kesineni nani political future impassable| tdp| resign| ycp| congress| vijayawada| mp| chinni
posted on Jan 6, 2024 11:41AM
తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పడింది. తాను ఎంపీ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించినా, ఆయన రాజీనామా చేసినట్లు కాదు, తెలుగుదేశం పార్టీయే ఇక మీ అవసరం లేదని మర్యాదగా తప్పించిందనే చెప్పాలి. తాను రాజీనామా చేయబోతున్నట్లుగా చేసిన ట్వీట్ లో కేశినేని నాని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చంద్రబాబే స్వయంగా పార్టీకి తన అవసరం లేదని చెప్పిన తరువాత తాను ఇంకా ఆ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదనీ అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నాననీ చెప్పారు.
అయితే కేశినేని నాని ఇంకా రాజీనామా చేయలేదు. త్వరలో హస్తినకేగి అక్కడ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇందులో లాజిక్ ఏమిటన్నది ఆయనకే తెలియాలి కానీ, పరిశీలకులు మాత్రం స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా.. అన్నట్లు నాని విజయవాడ నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నిక కావడం ఆయన బలం కాదు, తెలుగుదేశం బలమని అందరికీ తెలిసిదే.. 2019లో నాని విజయం తరువాత ఆయన స్వరంలో మార్పు రావడానికి ఆ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావడమేననడంలో సందేహం లేదు. దీంతో ఆయన తెలుగుదేశం కంటే తానే మిన్న అన్న భావనలో కొంత కాలం ఆయన ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసినా, అధికార పార్టీ నేతలతో అంటకాగినా.. ఆ తరువాత తత్వం బోధపడింది.
అయితే అప్పటికే ఆలస్యమైంది. తెలుగుదేశం పార్టీ కేశినేని నాని విషయంలో ఒక డెసిషన్ తీసేసుకుంది. పార్టీ లైన్ ను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న ఆయనకు మూడో చాన్స్ ఇచ్చేదే లేదన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ విషయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేసింది కూడా. కేశినేని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని విజయవాడ నుంచి లోక్ సభకు పోటీలోకి దింపాలని నిర్ణయించుకోవడమే కాదు, ఆ విషయాన్ని సోదరులిరువురికీ స్పష్టంగా తెలిసేలా చేసింది. అప్పటి నుంచి కేశినేని నాని ప్రతి ప్రయత్నం మళ్లీ పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికే అన్నట్లుగా వ్యవహరించారు. వ్యవహరిస్తూ వస్తున్నారు. సోదరుడు చిన్నితో ఉన్న విభేదాలు కుటుంబపరమైనవి కావడంతో నాని వైఖరిలో వచ్చిన మార్పు వారిరువురి మధ్యా సఖ్యత కు మాత్రం దోహదపడలేదు. చిన్నిని పక్కన పెడితే చాలు పార్టీకి పూర్తిస్థాయిలో విధేయుడినై ఉంటానన్నట్లుగానే కేశినేని నాని వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తిరువూరు గొడవ తరువాత ఇకెంత మాత్రం నాని విషయంలో ఉపేక్షించరాదన్న నిర్ణయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చేశారు. అందుకే తన సహజ తీరుకు భిన్నంగా విస్ఫష్టంగా నానికి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పార్టీ ప్రతినిథుల ద్వారా సమాచారం అందించారు.
దీంతో కంగుతిన్న కేశినేని నాని విషయం జీర్ణించుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఒక ఫ్లైట్ కాకపోతే మరో ఫ్లైట్ అంటూ చెప్పినా, రాజీనామా ప్రకటన చేసినా భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఒక నిర్ణయానికి రాలేక సతమతమౌతున్నారని పిస్తుంది. ఇక ఆయనకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒక దానిలో చేరడం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఆయన వైసీపీ గూటికి చేరడం ఆత్మహత్యాసదృశమే అవుతుంది. ఏపీ వ్యాప్తంగా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
ఆ పార్టీ వారే బయటకు రావడానికి దారులు వెతుక్కుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీలో చేరడం వల్ల నానికి ఒరిగేదేమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్న సూచనలు కనిపిస్తున్నా, అవేమీ ఆ పార్టీ మెజారిటీ సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తుందన్నంత స్థాయిలో లేవు. ఈ రెండూ కాకుండా ఆయనకున్న మరో ఆప్షన్ ఏమిటంటే.. మౌనంగా తెలుగుదేశంలో కొనసాగుతూ.. తన వ్యాపారాలు చూసుకుంటూ మాజీ ఎంపీ హోదాను అనుభవించడమే.