వైకాపా ఫినిష్.. జగన్ అధికారం ఇక వంద రోజులే.. రఘురామకృష్ణం రాజు | ycp defeat confirm says ragurama raju| people| angry| sittings| change| revolt| nellore| pedda
posted on Jan 7, 2024 6:26AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి ఆ పార్టీ అధినేత జగన్ కు కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ ఓటమిని అధిగమించి పార్టీని గెలుపు మార్గం పట్టించేందుకు ఆయన చేపట్టిన సిట్టింగుల నియోజకవర్గాల మార్పు కార్యక్రమం పార్టీ పరిస్థితిని పతనం నుంచి పాతాళానికి దిగజారిపోయేలా చేస్తోంది. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అదే చెబుతున్నారు. శ్రీకాకులం నుంచి అనంతపురం వరకూ వైసీపీ గెలిచే స్థానాలు 18 నుంచి 20 మాత్రమేనని రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు. ఇక పోటాపోటీగా ఉండే ఓ పాతిక స్థానాలలో ఓ 15 అటూ ఇటై గెలిచినా వచ్చే ఎన్నికలలో వైసీపీకి 35 స్థానాలకు మించి దక్కు పరిస్థితి లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. అయితే ఇప్పుడు నెల్లూరు కు చెందిన పెద్దా రెడ్లు, గుంటూరు కు చెందిన మంచి వ్యక్తులు తెలుగుదేశం కూటమి వైపు చూస్తున్నారనీ, వారు కూడా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తు ఇక జగన్ కు గెలుపు ఆశ అనేది దేవదాసు సినిమాలోని కలయిదని… అనే పాట చందమేనని అన్నారు. ఆ పాటను వైసీపీ నాయకులు ప్రాక్టీస్ చేస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. శనివారం(డిసెంబర్ 6) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజల్ని ప్రేమించే విధానాన్ని ఆరు రోజుల్లోనే తెలుసుకొని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరో వారం, పది రోజుల వ్యవధిలో ఆయన తెదేపా, జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తురన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పడితే, అంబటి రాయుడు ఆరు రోజులనే అర్థం చేసుకొని పార్టీని వీడారన్నారు. బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగులు చేస్తాడనుకున్న రాయుడు, హిట్ వికెట్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేయవచ్చు. రాబోయే రోజుల్లో మునిగిపోయే నావ వంటి వైకాపాను వీడాలని అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే, క్రికెట్ లో ఎంత వేగంగా అయితే పరుగులు చేస్తారో అంతే వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాల్సిందేనని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే ఆ పార్టీని వీడి తెదేపాలో చేరిన విషయం తెలిసిందేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు సనామదేయులు రానున్న రెండు మూడు రోజులలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక జగన్ సమీప బంధువు బాలినేని రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ, తిట్టమంటే తిట్టలేను, కొట్టమంటే కొట్టలేనని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బయటపడిపోయారు. కృష్ణదేవరాయలను గుంటూరుకు వెళ్ళమంటే, నిర్మొహమాటంగా నో అనేశారు. అమరావతి రైతులకు అంతగా అన్యాయం చేశాక మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుంటూరు స్థానం నుంచి వైకాపా తరఫున బుద్ధి ఉన్నవారెవరూ పోటీ చేయరని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒకవేళ పోటీ చేసినా దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎవరైనా విజయవకాశాలు మెండుగా ఉన్న తెలుగుదేశం తరఫున పోటీ చేయాలని భావిస్తారు.ఎందుకంటే ఆ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం నాయకత్వం ఎన్నో ప్రణాళికలను అమలు చేసింది. తెలుగుదేశం తరుపున పోటీ చేసే వారు నూటికి నూరు పాళ్ళు విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారు . గుంటూరులో ఇంత నెగిటివిటీ ఉందని అంబటి రాయుడు అర్థం చేసుకున్నారు కనుకనే పార్టీని వీడారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆ కారణంతోనే అక్కడ నుంచి పోటీకి కృష్ణదేవరాయలు నిరాకరించారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఇక పన్నెండు గంటలు ఎదురు చూసినా కాపురామచంద్రారెడ్డికి 12ఎదురు చూసినా జగన్ మోహన్ రెడ్డి దర్శన భాగ్యం దక్కలేదనీ చెప్పిన రఘురామకృష్ణం రాజు, దీంతో ఆయన ఇంత కాలం భగవత్ స్వరూపుడిగా భావించి, కీర్తించిన జగన్ పై ఆగ్రహించిన మీడియా సమక్షంలోనే తాడేపల్లి ప్యాలెస్ కు ఓ దండం అంటూ నిష్క్రమించారని గుర్తు చేశారు. పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్ బాబును బెదిరించడంతో ఆయనతో వైకాపాలోనే కొనసాగుతానని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంకొన్ని వారాలపాటు భయపెడితే భయపెట్టవచ్చు. కానీ ఆ తరువాత వారు నిజాలని బయట పెడుతారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఇక గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అయితే రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాను వీడి గుడివాడ అమర్నాథ్ జనసేనలో చేరలేని పరిస్థితి నెలకొంది. గుడివాడ అమర్నాథ్ పరిస్థితి చూసి తన మనసు నొచ్చుకుందన్నారు. అమర్నాథ్ కు మరొకచోట సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తానే సెల్ఫీ ఫోటో ఇచ్చానని చెప్పుకున్న అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అయినా ఆయన చేత అన్యాయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత విమర్శలు చేయించారు. జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్న అమర్నాథ్ ను ఇలా మోసగించడం దారుణమన్నారు. ఎమ్మెస్ బాబు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరహాలోనే అమర్నాథ్ కూడా తాను టికెట్ ఇచ్చినా… ఇవ్వకపోయినా వైకాపాలోనే కొనసాగుతానని చెబితే చెప్పవచ్చు. కానీ అమర్నాథ్ కే ఇలా జరిగిందంటే నమ్ముకున్న నాయకుడికి క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది. ఏముంటుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అమర్నాథ్ పరిస్థితే ఇలా ఉంటే… జోగి రమేష్ ను ఏం చేస్తారో తెలియదు. స్పీకర్ స్థాయి పక్కనపెట్టి జగన్ కోసం వందిమాగధుడి స్థాయికి దిగజారిన తమ్మినేని సీతారాంకు కూడా షాక్ ఇచ్చారు. స్థాయిని మరిచి దిగి వచ్చిన తరువాత కూడా టికెట్ లేదని జగన్ తమ్మినేనికి మొండి చేయి చూపడంతో ఆయన అనారోగ్యం పాలయ్యారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అనంతపురం నుంచి మొదలుకొని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తో పాటు ఉభయ గోదావరి జిల్లాలలోనూ ఇదే తరహాలో శాసన సభ్యులకు మింగుడు పడని నిర్ణయాలను జగన్ తీసుకున్నారనీ, శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం , విశాఖపట్నంలో మంత్రి అమర్నాథ్ షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒక వేళ ఎమ్మెల్యేలు తప్పు చేశారనుకుంటే ఇంత మంది ఎమ్మెల్యేలు ఒకేసారి తప్పు చేస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి పైన కోపం ఉన్నది. ఆ కోపాన్ని జగన్ ఎమ్మెల్యేలపైకి తోసేస్తున్నారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాం శాసనసభలో అడ్డగోలుగా సహకరించినందుకు ప్రజలకు కోపగించుకున్నారంటే అర్థం ఉంది. అంతేకానీ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేసిన అన్యాయం ఏముంది?, న్యాయం ఉందో లేదో పక్కన పెడితే, కోపగించుకోవడానికి ఆయన చేసిన అన్యాయం ఏమైనా ఉందా? అంటూ నిలదీశారు.
పాలకులు తెలుగు భాషకు
అన్యాయం చేయాలని చూస్తున్నారని, అటువంటి పాలకులకు బుద్ధి చెప్పాలన్న జగన్మోహన్ రెడ్డి సాహసానికి సెల్యూట్ చేస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాజమండ్రిలోని చైతన్య రాజు కాలేజీలో తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్, స్వామి స్వరూపానంద తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే తెలుగు భాషకు అన్యాయం చేసింది ఎవరో అందరికీ తెలుస్తుంది. మూడవ తరగతి విద్యార్థులకు కూడా టోపెల్ పరీక్షలు నిర్వహిస్తానని, అమ్మ, నాన్న అని పిలువ వద్దు… మమ్మీ డాడీ అని పిలవాలని, ఇంగ్లీష్ భాషలో మీడియంలో బోధిస్తామంటే తనపైనే నిందలు వేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నది ఎవరని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మాతృభాషను ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలి. తెలుగులో స్పష్టంగా మాటలు పలికే విధంగా ఉండాలి. ప్రపంచ భాషలలో కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా తెలుగు భాష గుర్తింపు పొందింది. తెలుగు భాషను పాలకులు చంపే ప్రయత్నాన్ని చేస్తుంటే, 2019 నవంబర్లో విభేదించి మాట్లాడినందుకే జగన్మోహన్ రెడ్డికి, నాకు మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకొని, భాషా పరిరక్షణ కోసం కృషి చేయాలి. ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరూ అనడం లేదు. తెలుగు మీడియంలో కొన్ని క్లాసుల వరకు చదువుకునే వారికోసం చదువుకునే వెసులుబాటును కల్పించాలి. మాతృభాషలో ఏదైనా విషయాన్ని సులువుగా ఆకలింపు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే ఏమి కొత్తగా ప్రవేశపెట్టలేదు. గత ముఖ్యమంత్రుల హయాంలో కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బోధన జరిగింది. మాతృభాషను గౌరవించని వారు, మనల్ని గౌరవిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. తల్లిని గౌరవించలేనివాడు తల్లి భాషను గౌరవిస్తారా? అని రఘురామ నిలదీశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మాతృభాష నేర్చుకునే విధంగా కృషి చేయాలన్నారు. మాతృభాష నేర్చుకున్న తర్వాత, ఇంగ్లీష్ భాషను నేర్చుకుందామని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఆడుదాం ఆంధ్ర పేరిట ఆర్భాటంగా ప్రారంభించిన కార్యక్రమం మూడవ రోజు అడ్రస్ లేకుండా పోయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తొలిరోజు క్రీడా శాఖ మంత్రి రోజాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రికెట్ పాఠాలను నేర్పించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక జగన్ ఆర్భాటంగా మొదలు పెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మూడో రోజుకే అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో రాజకీయ ఆటలు తప్ప ఆడుదాం ఆంధ్ర ఆటలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర కంటే ఎక్కువగా అంగన్వాడీల ఆటలు, పాటలు వినిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులు అవుట్ అని అర్ధం చేసుకోవాలన్నారు. వ్యక్తిగత పబ్లిసిటీ పిచ్చితో అన్నింటిపై బొమ్మలను వేసుకొన్నారు. రాజమండ్రిలో మూత్రశాలల వద్ద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు జక్కంపూడి రాజాల ఫోటోలను ముద్రించినట్లుగా మీడియాలో చూశానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ని ఉద్దేశించి వైసీపీ చెందిన ఒక మహిళా ప్రతినిధి, విదేశీ ప్రతినిధి తో పాటు పలువురు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు జుగుస్సా కరంగా ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు . మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఏ ఇంటి మహిళను కూడా ఇంతలా కించపరచకూడదు. తన రాజకీయ అవసరాల కోసం వైఎస్ షర్మిలను కాళ్లు అరిగేలా తిప్పి, ఆమెకు ఏ పదవి లేకుండా చేసి, ఇప్పుడు ఆమె తన దారి తాను చూసుకుంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కొమ్ముకాసే పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది చేత షర్మిల, కేఏ పాల్ కు ఎక్కువ, కమ్యూనిస్టులకు తక్కువ అని ఏక వచనంతో అపహస్యం చేయించడం దారుణమని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎవరు కే ఏ పాల్ కు ఎక్కువో, కమ్యూనిస్టులకు తక్కువనో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న 100 రోజుల్లో వైకాపాకు పడనున్న డెంట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి గేట్ రెడీ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన వైఎస్ షర్మిల కుటుంబ ఆపేక్షలన్నింటినీ పక్కనపెట్టి వైకాపా ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. ఏపీలో జరగబోయే మహాసంగ్రామానికి వైఎస్ షర్మిల కార్యోన్ముఖురాలు కావడంతో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కలత చెంది, తన కుమారుడు భార్గవ రాముడు పర్యవేక్షిస్తున్న సోషల్ మీడియాను విభాగం ద్వారా షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయించడం దారుణమని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు .
తమ వేతనాలు పెంచాలని ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అంగన్వాడీల పై ఎస్మా చట్ట ప్రయోగం చెల్లుతుందా?, చెల్లదా? అన్నదానిపై స్పష్టమైన అవగాహన లేదన్నారు. గౌరవ వేతనంతో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలనుకోవడం దారుణం. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన దాఖలాలు లేవు. వారేమి ప్రభుత్వ సిబ్బంది కాదు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని వారు కోరుతున్నారు. ఒకవేళ వారి కోరిక సమంజసం కాకపోతే పిలిపించి మాట్లాడాలి. వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, నిర్లక్ష్యంగా నియంత లాగా, రాచరిక వ్యవస్థలో వ్యవహరించినట్లుగా వ్యవహరించడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం సరికాదన్నారు. సచివాలయానికి నిత్యం వెళ్లకుండా ఏదో మంత్రి వర్గ సమావేశానికి మాత్రమే హాజరయిన ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదనీ, ఇంట్లోనే కూర్చొని, అప్పుడప్పుడు బటను నొక్కే కార్యక్రమం పేరిట హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ, ప్రజలను, మంత్రులను, శాసన సభ్యులను కలవకపోవడం సిగ్గుచేటన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని గత నాలుగున్న ఏళ్లు గా మొదలు పెడతామని చెప్పిఇప్పటి వరకూ ఆరంభించలేదు. ప్రజలు ఎవరినైనా సరే అందుబాటులో ఉండి అన్ని సేవలను అందిస్తారని ఉద్దేశంతోనే ఎన్నుకుంటారు కానీ, ప్యాలెస్ లలో కూర్చుని ప్రజాసమస్యలు పట్టిచుకోని వ్యక్తిని కాదన్నారు. ఇక జగన్ అడ్డోలు నిర్ణయాలకు న్యాయస్థానాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .
జనవరి 13న తన నియోజకవర్గానికి వెడుతున్నానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తరువాత తాను తన సొంత నియోజకవర్గంలో అడుగుపెడుతున్నానని చెప్పిన ఆయన ఈ నాలుగేళ్లుగా నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉన్నానో, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నాను. వారితో మాట్లాడుతూనే ఉన్నాను. అయినా, మతం ముసుగులో కొంతమందికి డబ్బులు ఇచ్చి నన్ను ప్రశ్నించేందుకు వైకాపా నాయకత్వం మనుషులను పంపనుంది. నన్ను ప్రశ్నిస్తే… అన్ని విషయాలు బయట పెడతాను. ఇవన్నీ మళ్లీ చెప్పించాలనుకుంటే, పంపండి అని సవాల్ చేశారు. ఇక పోలీసులు తమ పని తాము చేసుకుంటే మంచిదనీ, రాబోయే రోజుల్లో పోబోయే ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పారని చెత్త కేసులు పెట్టి, పిచ్చి పనులు చేయకుండా సంయమనం పాటించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి కార్యక్రమాన్ని చేపడితే, ప్రతిరోజు నేను వారి ఇండ్లలోనే ఉంటున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి బతికించడానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రా కదిలి రా పిలుపునందుకొని కనిగిరి నియోజకవర్గ సభను ప్రజలు బ్రహ్మాండంగావిజయవంతం చేశారని రఘురామకృష్ణం రాజు చెప్పారు.