Leading News Portal in Telugu

జనసేన చాలు.. బీజేపీ వద్దు! | no bjp janasena in enough| babu| tdp| rethink| ycp| kamalam| secret


posted on Jan 7, 2024 10:04AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకునే విషయం మీద తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనబడటం లేదు.   పొత్తులో భాగంగా పవన్‌ కల్యాణ్‌  నాయకత్వంలోని జనసేన తో సీట్ల సర్దుబాటు  దాదాపుగా కొలిక్కి వచ్చింది. జనసేనకు పాతిక అసెంబ్లీ , రెండు లోకసభ స్థానాల కేటాయింపునకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ తరుణలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాము తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసే ఎన్నికలకు వెడతామని ప్రకటించడం ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపినట్లయ్యింది. తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయిన తరువాత పురందేశ్వరి చేసిన ప్రకటనను తెలుగుదేశం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అదీ కాక ఒక వైపు పురందేశ్వరి పొత్తు ఉంటుందని గట్టిగా చెబుతుంటే, కొందరు నేతలు మాత్రం  పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుంచే రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతే కాకుండా  బీజేపీ నాయకులు కొందరు పొత్తులో భాగంగా అత్యధిక స్థానాలను డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏపీలో బీజేపీకి ఉన్న బలం కానీ, ఓటు స్టేక్ కానీ దాదాపు శూన్యం అని చెప్పవలసి ఉంటుంది.  ఆ విషయం బీజేపీకి కూడా స్పష్టంగా తెలుసు. ఇక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బీజేపీని క లుపుకుంటే మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తోంది. బీజేపీ పొత్తులో లేకుండా విడిగా అన్ని స్థానాలలోనూ పోటీ చేసినా ఆ పార్టీ  ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చే అవకాశాలు లేవన్నది పరిశీలకుల విశ్లేషణ. కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది, మరో సారి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయన్న ఏకైక కారణంతో ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం రాష్ట్రంలో తెలుగుదేశంకు కానీ, జనసేనకు కానీ ఏమీ మేలు చేయదు. అందుకే బీజేపీని కలుపుకు పోయే విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుగుదేశం వర్గాల ద్వారానే తెలుస్తోంది.  

తొలుత బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. సానుకూలంగా ఉన్నారనే కంటే పొత్తు ఉంటే బెటర్ అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అందుకే బీజేపీతో తనకు విభేదాలు లేవనీ, గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి విభజన చట్టంలోని హామీల అమలులో జరిగిన తీవ్ర జాప్యమే కారణమని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం, జనసేన కూటమి మరింత బలోపేతం అయ్యి, సమన్వయంతో ఇరు పార్టీల ఓట్ల బదలాయింపు జరిగేలా చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు. మరో వైపు జనసేనాని కూడా మోడీ ఆశీస్సులు ఉన్నాయని ఓ వంక అంటూనే ఆ పార్టీ నిర్ణయం వచ్చే వరకూ వేచి ఉండకుండా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడమే కాకుండా సీట్ల సర్దుబాటుకు కూడా రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికలలో బీజేపీతో పొత్తు లేకుండానే, అంటే ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు లేకుండానే ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం, జనసేన దాదాపుగా నిర్ణయానికి వచ్చేశాయని చెప్పవచ్చు. 

అయితే జాతీయ పార్టీ, పైగా కేంద్రంలో అధకారంలో ఉన్నమన్న దర్పంతో బీజేపీ ఒక వైపు పొత్తుకు తహతహలాడుతూనే నేల విడిచి సాము చేసిన చందంగా సీట్లు కోరుతోంది. పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం సీట్ల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలనీ, రాష్ట్రంలో పార్టీ బలానికి తగినట్లుగా ఒకటి రెండు స్థానాలతో సంతృప్తి చెంది అయినా పొత్తు కుదుర్చుకోవాలని అంటున్నారు.  ఈ నేపథ్యంలో నే  జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఇరువురి మధ్యా పొత్తు విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  

పైకి బీజేపీ ఇన్ని స్థానాలు, అన్ని స్థానాలూ అని డాంబికంగా ప్రకటనలు చేస్తున్నా.. లోపాయికారిగా మాత్రం గతంలో  అంటే 2014 ఎన్నికలలో పొత్తులో భాగంగా తెలుగుదేశంబిజెపి కి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలు ఇస్తే చాలని చెబుతున్నట్లు సమాచారం. అయితే లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం ఒకింత గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.  అరకు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి,  రాజంపేట, హిందూపూర్‌ లోకసభ స్థానాలను కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. పది అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించే పరిస్థితి లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 2014 అన్ని స్థానాలు కేటాయించడానికి తెలుగుదేశం అంగీకరించడానికి కారణం అప్పట్లో జనసేన ఎన్నికల బరిలో లేదు. బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఇప్పుడలా కాదు. ఆ పార్టీ పొత్తులో భాగస్వామి. పైగా బీజేపీ కంటే ఎన్నో రెట్లు ప్రజాబలమే కాకుండా ఓటు బ్యాంకు కూడా ఉన్న పార్టీ. ఈ పరిస్థితుల్లో కనీసం ఒక శాతం ఓటు స్టేక్ లేని బీజేపీకి పది స్థానాలు కేటాయించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు. అందుకే బీజేపీతో సీట్ల విషయంలో బేరసారాలు ఆడటం కంటే  ఆ పార్టీని పొత్తుకు దూరంగా ఉంచడమే మేలని చంద్రబాబు భావిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

అన్నిటికీ మించి వైఎస్‌ షర్మిల  కాంగ్రెస్‌లో చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనుండటం కూడా  బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.  షర్మిల ప్రభావం కాంగ్రెస్ పార్టీని ఏపీలో విజయతీరాలకు చేర్చే అవకాశాలు లేవుగానీ  పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను చీలుస్తుందని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీని పొత్తులోకి తీసుకుని కొన్ని సీట్లు వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం పెద్దగా లేదన్నది ఆయన భావనగా కనిపిస్తోంది.  అన్నిటికీ మించి గత నాలుగున్నరేళ్ల కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రాష్ట్రంలో జగన్ అరాచక, అస్తవ్యస్త పాలనకు అన్ని విధాలుగా అండగా నిలబడి కాపాడుతూ వచ్చిందన్న భావన ప్రజలలో బలంగా ఉందనీ,  ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటూ సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా పాడు చేసుకోవడమే అవుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పలు సర్వేలు కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీని కలుపుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు విషయంలో వెనక్కు తగ్గారనీ, పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.