Leading News Portal in Telugu

నందమూరి తారకరామారావు అనే నేను.. 41 ఏళ్ల కిందట ఇదే రోజు సీఎంగా ఎన్టీఆర్ తొలి సారి ప్రమాణ స్వీకారం | 41 years back ntr 1st time oath as ap cm| people| leader| model| good governance| poor| women


posted on Jan 9, 2024 8:47AM

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. తారకరామడి పేరు తలుచుకోగానే  ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవ నవోన్మేష చైతన్య స్వరూపం . ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ అనితరసాధ్యమైన కీర్తి బావుటాను ఎగరేసిన ప్రతిభామూర్తి.  వెండితెరపై   అగ్రగామిగా నిలిచిన ఆయన రాజకీయాలలోనే తనకు తానే సాటి అని రుజువు చేసుకున్నారు.  నాయకుడిగా, మహానాయకుడిగా, ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజాజీవితంలో ప్రజలతో పెనవేసుకుపోయారు. 

అయన రాజకీయ ప్రవేశమే ఒక ప్రభంజనం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకూ రాష్ట్రంలో ఓటమి అనేదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, తిరుగులేని ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సరిగ్గా 41 ఏళ్ల కిందట ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

1983 జనవరి 9 తెలుగు కీర్తిపతాక ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.  రాజకీయం జనం చెంతకు చేరిన రోజు.   తెలుగువాడి  తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అప్రతిహాత కాంగ్రెస్  అధికార పెత్తనానికి, తెలుగువారిని చిన్న చూపు చూసిన కాంగ్రస్ పాలనకు చరమగీతం పాడిన రోజు. ఔను సరిగ్గా 41 ఏళ్ల కిందట నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు.  

పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన  రాజభవన్ ఇరుకు గోడల మధ్య కాకుండా, ప్రజా సమక్షంలో   లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు.  హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది. అప్పటి గవర్నర్   కె.సి. అబ్రహం   ఏపీలో తొలి కాంగ్రెసేతర  ముఖ్యమంత్రి గా రామారావు  చేత పదవీస్వీకార ప్రమాణం చేయించారు. అచ్చ తెలుగులో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని చాటారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. ప్రజాసేవే తన అభిమతమని చాటారు.  అన్నట్లుగానే అవిశ్రాంతంగా  ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారు. అప్పటి దాకా అధికారమంటే  విలాసం, పెత్తనం అని భావించిన నేతలకు అధికారం అంటే బాధ్యత అని తెలిసొచ్చేలా చేశారు.  తనను సినీరంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన క్రమశిక్షణ,క్రమవర్తన,సమయపాలనలను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు.  నిరాడంబరతకు ఆయన నిలువెత్తు రూపు. ముఖ్యమంత్రిగా అత్యంత విలాసవంతమైన భవనంలోకి మారే అవకాశం ఉన్నా, అందుకు ఆయన అంగీకరించలేదు. ఆబిడ్స్ లోని తన నివాసంలోనే ఉన్నారు. సీఎంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు.  ఖరీదైన కార్ల జోలికి పోలేదు. అంబాసిడర్ కారునే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ వినియోగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా వద్దనేశారు.  అయితే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. కిలో రెండు రూపాయలకే బియ్యం ఆయన ప్రారంభించిన పథకమే. ఇప్పుడు అదే పథకం దేశం మొత్తం ఆచరణలోకి వచ్చింది. బడుగుబలహీన వర్గాలకు పాలనలో, అధకారంలో భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ వల్లే సామాన్యులలో సైతం రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది. 

చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల సంక్షేమం,  మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్  అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అందుకే ఎన్టీఆర్ తెలగు కీర్తి, తెలుగుఠీవి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎప్పటికీ జనం గుండెల్లో కొలువై ఉంటారు.