జగన్ ను చూసి కాదు.. నన్ను చూసి ఓటేయండి.. మారిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు! | ycp mlas lost confidence on jagan| accepting| anti
posted on Jan 9, 2024 11:37AM
నిన్న మొన్నటి దాకా జనం వై జగన్ అంటుంటే.. వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలూ, మంత్రులూ ఓన్లీ జగన్ అంటూ వచ్చారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గాల మార్పు అంటూ సిట్టింగులను ఇష్టారీతిగా మార్చేయడం ఆరంభించారో వారు కూడా వై జగన్ అంటూ పక్క చూపులు చూస్తున్నారు. లేదా నో పోటీ అంటూ సైడైపోతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాత్రం జగన్ ను చూసి కాదు నన్ను చూసి ఓటేయండి అని తన నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు.
విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి జగన్ ఫేస్ వేల్యూ తనను గెలిపిస్తుందన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. పార్టీ అభ్యర్థిగా జగన్ ఫొటో పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లడం కంటే తన గుడ్ విల్ ని పణంగా పెట్టి ఓట్లడగడమే బెటర్ అని ఫిక్సైపోయారు. అంతే ప్రజలు అడుతారని భావించిన ప్రశ్నలన్నీ ఆయనే వేస్తూ, ఆ సమస్యలేవీ తన పరిధిలో పరిష్కారమయ్యేవి కావంటూ సరెండర్ అయిపోయారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అల్పాహార విందు ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయన మనసు విప్పి వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిందన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఉపాధ్యాయుల సమస్యలను తన పరిధిలో పరిష్కరించలేనని చేతులెత్తేశారు. సీఎంపై మీ వ్యతిరేకతను అలాగే ఉంచుకోండి, కానీ ఓటు మాత్రం నన్ను చూసి వేయండని వేడుకున్నారు.
కేవలం ఉపాధ్యాయ సంఘాల నేతలతోనే కాకుండా, నియోజకవర్గాల పరిధిలోని పలు సామాజిక వర్గాల నేతలతోనూ కోలగట్ల వీరభద్రస్వామి రహస్య భేటీలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారితో కూడా ఈ తరహాలోనే ఆయన తనను గెలిపించాలని కోరినట్లు తెలిసింది. కాగా నిన్న మొన్నటి వరకూ జగన్ తమ సర్వస్వం అన్న వారంతా ప్రజా వ్యతిరేకతకు బెదిరి జగన్ మొహం చూసి కాదు, మమ్మల్ని చూసి ఓటేయండి అంటూ బతిమలాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మిమ్మల్ని గెలిపించే సత్తా నాకు లేదు అని సిట్టింగుల మార్పుతో జగన్ చేతులెత్తేయడంతో, ఇక ఎమ్మెల్యేలు కూడా మీ అవసరం మాకు లేదు, మా గెలుపేదో మేమే గెలుస్తాం అని చెప్పేయడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
పరిస్థితి చూస్తుంటే జగన్ పార్టీ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ముందు ముందు జగన్ కు విధేయంగా ఉంటే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రమేయం లేకుండా తమ సొంత సత్తామీద గెలిచిన వారికి జగన్ కు విధేయంగా ఉండాల్సిన అవసరమేముంటుందని అంటున్నారు. మొత్తంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ చేస్తున్న ప్రయోగం ఆయన నాయకత్వానికే ఎసరు తీసుకువస్తోందని చెబుతున్నారు.