Leading News Portal in Telugu

 తొలిసారి ప్రజా భవన్ కు వైఎస్ షర్మిల.. కొడుకు పెళ్లికి రావాలని భట్టికి ఆహ్వానం 


posted on Jan 12, 2024 11:45AM

తెలంగాణ  ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి గల కారకులలో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల  ఒకరు. ఆమె కొడుకు వివాహం వచ్చేనెలలో ఉంది. తాను స్థాపించిన వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్ లో విలీనం చేసే ముందు ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్, బిజెపిలను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ వోటు బ్యాంకును ఆమె పెంచగలిగారు. ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం వెనక వైఎస్ షర్మిల పాత్ర ఎంతైనా ఉంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసిన తరువాత షర్మిల మొదటి సారిగా ప్రజా భవన్ గతంలో ప్రగతి భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు వచ్చిన షర్మిల ఆయనకు కుశల ప్రశ్నలు వేసి… డిప్యూటీ సీఎం అయినందుకు కంగ్రాట్స్ తెలిపారు. మల్లు భట్టిని ఆయన నివాసం ప్రజా భవన్‌లో షర్మిల కలిశారు. ‘భట్టి అన్నా… బాగున్నారా? మీరు ఉపముఖ్యమంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది… కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఆమె పలకరించారు.

ఆ తర్వాత తన కొడుకు వివాహానికి తప్పకుండా రావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కాగా, ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖులకు వరుసగా పెళ్లి పత్రికలను అందిస్తున్నారు.