posted on Jan 12, 2024 12:38PM
ప్రతీ వారం రెండు రోజుల పాటు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది.
తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ప్రజాభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అధికారులు వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రతి నెల పదో తేదీ లోపే మెస్ బిల్లులు, వేతనాల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు రూ.3వేల వేతనం పెంచారని… దీనిని వెంటనే అమలు చేయాలన్నారు. మరోవైపు జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు ప్రజాభవన్ వద్ద నిరసన తెలిపారు.
కాగా, ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్నది. రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.