సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు సేవలు లేనట్లే?! | congress no to use sunil kanugolu services in general| elections| assembly| state| confine| india
posted on Jan 13, 2024 9:46AM
కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా వ్యవహరించిన వ్యూహకర్త సునీల్ కనుగోలు లోక్ సభ ఎన్నికలలో పార్టీ వ్యూహకర్తగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టడం లేదా? సార్వత్రిక ఎన్నికలకు ఆయన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించరా అంటే పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ను పటిష్టం, బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించిందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్నది సూనీల్ కనోగోలే. అలాగే అసలు విజయం అన్న ఊహ కూడా లేని స్థితి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం చేజిక్కించుకునేలా చేయడం వెనుక ఉన్నవి కూడా సునీల్ కనుగోలు వ్యూహాలే. అటువంటి సునీల్ కనుగోలే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం వ్యూహకర్తగా వ్యవహరిస్తారనీ, ఎన్నికల ప్రచారం, సోషల్ మీడియా క్యాంపెయిన్ వంటి వ్యవహారాల పూర్తి బాధ్యత ఆయనే తీసుకుంటారనీ తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన బాధ్యతలను కుదించి హర్యనా, మహారాష్ట్రలకు పరిమితం చేస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుందన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో ఒకింత నిరుత్సాహాన్ని నింపాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏదైనా, ఈ నిర్ణయం సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బంది కలిగించేదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలూ, ప్రణాళికలూ వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సునీల్ కనుగోలుకు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గెలుపు బాధ్యతలను అప్పగించడం వల్ల భవిష్యత్ లో కాంగ్రెస్ కు మేలు చేస్తుందనీ, ఆ మేలు దీర్ఘ కాలం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
సునీల్ కనుగోలు వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టని మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేసేందుకు సునీల్ కనోగోలు సిద్ధపడినప్పటికీ, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్‌లు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఆయన ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కు దూరంగా ఉన్నారు.
ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇండియా కూటమిలో మిత్ర పార్టీల సీట్ల పంపకాలు, కూటమికి నేతృత్వవం వంటి అనేక సమస్యలు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ సునీల్ కనుగోలు సేవలను అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేయాలని భావించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు సేవలు లేకున్నా.. రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఉద్దేశంతోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ సునీల్ కనుగోలు సేవలను సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే బీజేపీ 12 రాష్ట్రాల్లో ఉన్నది. కాంగ్రెస్ రాష్ట్రాలలో పార్టీకి గట్టి పునాదులు వేసుకుని అధికారంలోకి రావాలన్న దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సునీల్ కనోగోలు సేవలను రాష్ట్రాలకు పరిమితం చేయాలని భావిస్తున్నది.