Leading News Portal in Telugu

సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ | cbn quash petition to cji bench


posted on Jan 16, 2024 1:11PM

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను  జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీజేఐ బెంచ్ కు రిఫర్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు.   దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది అన్నారు.

స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి.

దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు మంగళవారం (జనవరి 16)న వెలువడింది. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఈ కేసు తీర్పు విషయంలో న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వెలువరించడంతో సీజేఐ బెంచ్ కు రిఫర్ చేశారు.  అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు.  ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ వాదించారు.  చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో అంతా చంద్రబాబుకు క్వాష్ వర్తిస్తుందంటూ తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే   ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు  జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయంపై తీర్పు వెలువరించకుండా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. 

ఇలా ఉండగా  ద్విసభ్య ధర్మాసనంలో ని ఇరువురు న్యాయమూర్తులలో ముందుగా జస్టిస్ అనిరుధ్ బోస్ తన తీర్పు వెలువరిస్తూ స్కిల్ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని విస్పష్టంగా తేల్చారు. 17ఏ అమలులోకి రాకముందు జరిగిన దర్యాప్తును ఈ కేసులో చంద్రబాబు అరెస్టుకు వర్తింప చేయడం కూడదని పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు విధించిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయలేమని పేర్కొన్నారు.  ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదని తన తీర్పులో పేర్కొన్నారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేమని తన తీర్పులో పేర్కొన్నారు.   ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు వెలువరించడంతో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.