ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నియామకం.. తక్షణమే అమల్లోకి | aicc appoints sharmila as apcc chief| immediate| effect| new| josh
posted on Jan 16, 2024 2:28PM
లాంఛనం పూర్తై పోయింది. వైఎస్ షర్మిల ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని తెలుగువన్ ముందుగానే చెప్పింది. అలాగే సంక్రాంతి రోజు అప్పటి వరకూ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడంతో షర్మిలకు లైన్ క్లియర్ అయిపోయింది.
షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించే దిశగా చర్చలు జరుగుతున్న సందర్భంగానే ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైతే తాను రాజీనామా చేస్తానని గిడుగు రుద్రరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. గిడుగు రుద్రరాజు సోమవారం అంటే సరిగ్గా సంక్రాంతి నాడు రాజీనామా చేశారు. తెలుగువన్ ముందుగానే చెప్పినట్లు సంక్రాంతి మరునాడే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజు ఇలా రాజీనామా చేయడంతోనే షర్మిలను అలా ఏపీసీసీ చీఫ్ గా నియమించేసేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఏపీసీసీ చీఫ్ గా ఈ రోజు అధికారికంగా నియామకం జరిగినా, అంతకు ముందు నుంచే ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్ఠతకు తన వంతు కృషి ప్రారంభించేశారు.
ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల భారీ నష్టం వాటిల్లేది ఎవరికంటే పరిశీలకులు జగన్ పేరే చెబుతున్నారు. ఏపీ ఇక అన్నాచెళ్లెల్ల పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారబోతోందని విశ్లేషిస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఇప్పటికే పతనమైన జగన్ గ్రాఫ్ పాతాళానికి చేరడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి.
ఇప్పటి వరకూ అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి మధ్య ముఖాముఖీగా ఉన్న ఎన్నికల పోరు.. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో త్రిముఖ పోరుగా మారుతుందని, అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని కానీ, అద్భుతాలు జరుగుతాయని కానీ ఎవరూ భావించడం లేదు. కానీ షర్మిల కారణంగా జగన్ పార్టీకి మాత్రం కోలుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఔను నిజమే ఏపీలో కాంగ్రెస్ ఏ మాత్రం బలపడినా ఆ మేరకు నష్టపోయేది జగన్ రెడ్డే. ఎందుకంటే వైసీపీలో సీనియర్లంతా కాంగ్రెస్ నేతలే. క్యాడర్ కూడా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడరే. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరి ఇప్పుడు పదేళ్ల తరువాత కాంగ్రెస్ బతికి ఊపిరి పోసుకుంటే.. నిస్సందేహంగా వైసీపీకి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడటం ఖాయమంటున్నారు. రానున్న ఎన్నికల పోరు తెలుగుదేశం జనసేన కూటమి, వైసీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుగా ఉంటుందో, షర్మిల చేరికతో వైసీపీ ఇక అధికారం కోసం కాకుండా కనీసం తెలుగుదేశం, జనసేన కూటమి తరువాత రెండో స్థానంలో నిలవడానికి కాంగ్రెస్ తో పోటీ పడుతుందో చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.