బాబు హయాంలో పెట్టుబడులు భళా.. జగన్ పాలనలో డీలా! | babu rule golden era for investments| jagan| davoos| world| economic| forum| one| rupee
posted on Jan 18, 2024 9:39AM
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రగతి, పురోగతిపై కానీ, ప్రజల సంక్షేమంపై కానీ ఇసుమంతైనా దృష్టి లేదు. అధికారంలోనికి వచ్చిన క్షణం నుంచీ ఆయన దోపిడీపై పెట్టిన శ్రద్ధలో వందో వంతు కూడా రాష్ట్ర ప్రయోజనాలపై పెట్టలేదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి అయినా, సంక్షేమ పథకాలైనా సజావుగా సాగుతాయి. అందుకే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇందు కోసం అధికారిక పర్యటన చేస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఉన్న ఏ అవకాశాన్నీ జార విడుచుకోరు. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులాంటి వేదికలను రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగించుకుంటారు. అందుకోసం మిస్ కాకుండా, ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి అయినా సరే అటువంటి సదస్సులకు హాజరౌతారు. లేదా రాష్ట్రం నుంచి ప్రతినిథిబృందాన్ని పంపిస్తారు. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఆకర్షించడం కోసం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అతి ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సదస్సుకు విచ్చేసే పెట్టుబడిదారులకు తమ తమ దేశాలలోని వ్యాపార అవకాశాలను వివరించి వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ అంటే దాదాపుగా ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి మేలు జరగడం కోసం, పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించడం కోసం ఒక్కటంటే ఒక్క అధికారిక పర్యటన చేపట్టిన దాఖలాలు లేవు. దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ దేశాలను, రాష్ట్రాలను అభివృద్ధి చేసునేందుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు, తద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తహతహలాడతారు. ఇందు కోసం దావోస్ సదస్సును ఎంతోప్రతిష్టాత్మకంగా తీసుకుని పెట్టుబడులు ఆకర్షించడం కోసం తామే స్వయంగా వస్తారు. లేదా ప్రతినిథి బృందాలను పంపుతారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (1995-2004), అలాగే విభజిత ఏపీ సీఎంగా (2014-19) నారా చంద్రబాబునాయుడు పలుమార్లు దావోస్ సదస్సుకు వెళ్లారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నించారు. సఫలీకృతులయ్యారు. ఆయన హయాంలో పెట్టుబడిదారులు ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపేవారు. అయితే జగన్ హయాంలో ఆ పరిస్థితి లేదు. కోవిడ్ కారణంగా ఒక ఏడాది మినహాయిస్తే మిగిలిన నాలుగేళ్లలో నాలుగుసార్లు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులలో మూడింటికి జగన్ డుమ్మా కొట్టారు. రాష్ట్రం నుంచి పెట్టుబడుల ఆకర్షణకు ప్రతినిథి బృందాన్ని కూడా పంపలేదు. అలాగే సదస్సుకు ఆయన ఒక సారి హాజరైన సందర్భంలో కూడా రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలేవీ లేవనే చెప్పాలి. ఆయన దావోస్ పర్యటన ఒక విహార యాత్రలా సాగింది.
అదే చంద్రబాబు విషయం తీసుకుంటే 2015 జనవరిలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై రాష్ట్ర పారిశ్రామిక విజన్ ను ఆయన స్వయంగా వివరించారు.
ఫోరం ప్రెసిడెంట్ క్లాస్ స్వాబ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘భవిష్యత్ నగరీకరణ’పై మాట్లాడాలని కోరారు. చంద్రబాబు నాయుడి ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆహ్వానం ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఆ సదస్సులో మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ కోసం చంద్రబాబు నాయుడు తన విజన్‌ను సుస్పష్టంగా వివరించడం జరిగింది.
నాటి చంద్రబాబు నాయుడి కృషిని ఎకనామిక్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది. ఆ తరువాత 2016లో సైతం దావోస్ సదస్సులో పాల్గొని (మాస్టరింగ్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అన్న అంశంపై చంద్రబాబు ప్రసంగంచారు. నెస్లే, జాన్సన్, సీమెన్స్, మెకంజీ, లాక్‌హీడ్ మార్టిన్ ఎయిర్ బస్, జెట్రో, ఊబర్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
2017 లో వరుసగా మూడవసారి సదస్సులో పాల్గొని పెట్టుబడుల కోసం చంద్రబాబునాయుడు ఎంతో శ్రమించారు. ఆయన కృషితో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో నంబర్ వన్ 1 గా నిలుస్తోందంటూ అప్పట్లో జాతీయ పత్రికలు ప్రత్యేక కధనాలు ప్రచురించాయి. 2018 లో నాలుగో ఏడాది చంద్రబాబు నాయుడు గారు హాజరై పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు.
2019 లో నాటి ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ బృందానికి నేతృత్వం వహించారు. ఆ సందర్భంగా అనేకమంది దిగ్గజ విదేశీ పారశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా ఐదేళ్లు వరుసగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు హాజరవడం జరిగింది. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆకర్షించిన విదేశీ పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.
2014 -15 లో రూ. 8,326 కోట్లు
2015-16 లో రూ. 10,315 కోట్లు
2016-17 లో రూ. 14,767 కోట్లు
2017-18 లో రూ. 8,037 కోట్లు
2018-19 లో రూ. 23,882 కోట్లు
ఇలా మొత్తం మొత్తం రూ.65,327 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి.
2014-19 మధ్య కాలంలో దేశం మొత్తం మీద వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో మన రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు వాటా 14.7 శాతం. చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల కారణంగా రూ.65,327 కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. కియా మోటార్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి.
కియా మోటార్స్ వారు వేరే ప్రాంతాల్లో తమ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న నేపద్యంలో సైతం చంద్రబాబు నాయుడు స్వయంగా దక్షిణ కొరియా వెళ్లి కియా మోటార్స్ ప్రతినిధులతో చర్చలు జరిపి వారిని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది.
ఇదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడి చిత్తశుధ్ధి. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లలో తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ.6,679 కోట్లు మాత్రమే. ఇది జాతీయ స్థాయిలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఒక్క శాతం కంటే తక్కువ.
జగన్ రెడ్డి వైఫల్యం రాష్ట్రానికి శాపంగా మారింది. పెట్టుబడులు రాక నిరుద్యోగం పెరిగిపోయింది. పట్టభద్రులలో దేశంలో అత్యధికంగా నిరుద్యోగులు మన రాష్ట్రంలో నే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా అందించిన సమాచారం మేరకు 2022లో జగన్ రెడ్డి జరిపిన ఏకైక దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పైసా కూడా పెట్టుబడి రాలేదు.
ఇక తాజాగా దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్య వంటి వారు హాజరై తమ రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి గడప దాటలేదు.