Leading News Portal in Telugu

ఎన్టీఆర్ వర్దతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత


posted on Jan 18, 2024 1:38PM

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.  దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విగ్రహం వద్దకు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు – టీడీపీ, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా టిడిపి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరారు. పోలీసులు సమయం ఇచ్చినప్పటికీ అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులు అర్పించేందుకు ఆ పార్టీ నేతలు బయలు దేరారు. దీంతో వైకాపా కార్యకర్తలు, టిడిపి జనసేన శ్రేణుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జీ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు కొడాలి నానిని అనుమతించి… తమను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.