Leading News Portal in Telugu

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు.. వైఎస్ ఆత్మ కేవీపీ సెన్సేషనల్ కామెంట్స్! | kcp sensational comments on sharmila| apcc| chief| congress| hicommand| ys


posted on Jan 18, 2024 2:33PM

తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినా అనివార్యంగా వినిపించే పేరు మరొకటి ఉంటుంది. ఆ పేరు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ బతికున్నంత కాలం వారిరువూ జంటకవుల్లా ఉండేవారు. వైఎస్ రాజకీయ ప్రస్థానంలో కేవీపీ ఆయన వెంటే ఉన్నారు. కేవీపీ తనను తాను వైఎస్ ఆత్మగా  చెప్పుకునే వారు. వారిరువురి స్నేహబంధం తెలిసిన వారంతా (తెలియని వారెవరూ ఉండరనుకోండి అది వేరు సంగతి) కూడా కేవీపీని వైఎస్ ఆత్మగానే భావించే వారు. వైఎస్ కు ఇచ్చిన గౌరవం కేవీపీకి కూడా ఇచ్చే వారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా కేవీపీ సలహాలూ, సూచనలూ ఉండేవని ప్రతీతి. అటువంటి కేవీపీ వైఎస్ మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ కు రాజకీయంగా మార్గదర్శకుడిగానూ, అండదండగానూ ఉంటారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం కేవీపీని దూరం పెట్టారు. జగనే దూరం పెట్టారా? జగన్ స్వభావం తెలిసి కేవీపీయే దూరం జరిగారా అన్న చర్చను కాసేపు పక్కన పెడితే..  జగన్ సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ తో విభేదించినప్పుడు జగన్ పక్కన లేరు. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టగానే కేవీపీ హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ లో సీనియర్లంతా షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ పగ్గాలను అప్పగించ డాన్నిస్వాగతిస్తున్నారని చెప్పారు.

వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక, కాంగ్రెస్ కు మద్దతుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అప్పటి తన పార్టీ వైఎస్సార్టీపీని పోటీకి దూరంగా ఉంచడం వెనుక ఉన్న వ్యూహమంతా కేవీపీదేనని రాజకీయ వర్గాలలో ఓ టాక్ ఉంది. అయితే కేవీపీ మాత్రం ఆ విషయంలో ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఇప్పుడు కూడా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడాన్ని స్వాగతించారు. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  అయితే కేవీపీ జగన్ తీరు పట్ల, వైఖరి పట్ల, పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని, జగన్ ఏపీ పగ్గాలు చేపట్టిన మూడున్నరేళ్ల తరువాత ఒక్కసారి ఒకే ఒక్కసారి ఓపెన్ అయ్యారు. 

పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదనీ, నిలదీయకపోవడం సరే కనీసం విజ్ణప్తి కూడా చేయడం లేదని అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ  విమర్శించారు. అంతే అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ కేవీపీ తన ఆత్మబంధువైన వైఎస్ జగన్ కుమారుడి పాలనపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. 

 కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన ప్రాణస్నేహితుడి కుమారుడైన ఏపీ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని తనపై విమర్శలు వెల్లువెత్తినా కేవీపీ కనీసం స్పందించలేదు.  జగన్ అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, స్నేహితులు, చివరికి కుటుంబ సభ్యులు ఇలా అందరూ దూరం  అయిపోయినా, కేవీపీ మాత్రం ఇంత వరకూ జగన్ కు తెరవెనుక సహాయం అందిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ ప్రచారం, ఆరోపణలు, విమర్శలు అన్నిటినీ ఇప్పటి దాకా మౌనంగా భరించిన కేవీపీ   ఏపీలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ   వైఎస్ షర్మిలకు మద్దతుగా బహిరంగంగా ప్రకటన ఇవ్వడం ప్రాథాన్యత సంతరించుకుంది.  వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పడం ద్వారా తాను జగన్ కు దూరమేనన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా విస్పష్టంగా చెప్పేశారు. సో వైఎస్ ఆత్మ ఇక జగన్ పాలనకు వ్యతిరేకంగా షర్మిల నేతృత్వంలో చురుకుగా పని చేస్తారని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.