Leading News Portal in Telugu

మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో జగన్ కు పరాభవం! | insult to jagan in harmila son engagement function| heartly| recieve| photo| distance


posted on Jan 19, 2024 9:42AM

సొంత మేనల్లుడి వివాహ వేడుకలో ఏపీ సీఎం జగన్ కు పరాభవం ఎదురైందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆయనతో మాట్లాడేందుకు కానీ, ఫొటో దిగేందుకు కానీ సొంత సోదరి షర్మిల ముందువెనుకలాడిన వీడియోను చూసిన వారంతా. జగన్ ఎంతగా ఇబ్బంది పెట్టి ఉండకపోతే.. అన్నను దూరం పెట్టాలని షర్మిల ఎందుకు భావించి ఉంటుందని అంటున్నారు. వైఎస్ కుటుంబం మొత్తం జగన్ ను దూరం పెట్టేసిందనడానికి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుక ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు. 

ఏపీసీసీ చీఫ్ షర్మిల కుమారుడి నిశ్చితార్థం గురువారం (జనవరి 18) హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో జగన్ తో ఎవరూ కలివిడిగా మాట్లాడలేదు. సొంత మేనల్లుడి వివాహ నిశ్చితార్థ వేడుకలో జగన్ ఓ పరాయి వాడిలా, ఆహ్వానం లేని అతిథిలా మెలగాల్సి వచ్చింది.

ఈ విషయం ఎవరో జగన్ అంటే గిట్టని వాళ్లు, ఆయన రాజకీయ ప్రత్యర్థులో చెబుతున్న మాట కాదు. స్వయంగా ఏపీ సీఎంవో విడుదల చేసిన వీడియో ప్రత్యక్షంగా చూపింది. ఆ కార్యక్రమానికి వెళ్లిన జగన్  కు అక్కడ సాదర స్వాగతం లభించలేదు. అసలు ఎవరూ పలకరించిన పాపాన కూడా పోలేదు. ఆ విషయం స్వయంగా ఏపీ సీఎంవో విడుదల చేసిన వీడియో చూసిన అందరికీ స్పష్టంగా అర్థమౌతుంది. మొహమాటపు నవ్వులు, నామమాత్రపు పలకరింపులే జగన్ కు అక్కడ ఎదురయ్యాయి.  

సొంత అన్న జగన్ ను మొక్కుబడిగా పలకరించి దూరం జరిగిన షర్మిల, ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సాదరంగా ఆనందంగా ఆహ్వానించారు. ఆయనతో కలిసి ఫొటో దిగారు. అదే జగన్ విషయానికి వస్తే ఆయనను రిసీవ్ చేసుకుంటున్న సమయంలో ఫొటో దిగేందుకు కూడా షర్మిల ఇష్టపడలేదు. చివరిగా కుటుంబం గ్రూప్ ఫొటో సమయంలో కూడా జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచున్నారు. స్వయంగా జగన్ రెండు మూడు సార్లు పిలిచినా రాలేదు. చివరికి తల్లి విజయమ్మ నచ్చ చెప్పడంతో అయిష్టంగానే జగన్ పక్కకు వచ్చి నిలుచున్నారు.

మొత్తంగా జగన్ కుటుంబంలో ఏకాకిగా మిగిలిపోయారనడానికి నిలువెత్తు సాక్ష్యంగా షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక నిలిచింది. ఇంతా చేసి సొంత మేనల్లుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు తాడేపల్లి నుంచి సతీసమేతంగా వెళ్లిన జగన్ అక్కడి తిరస్కారాన్ని చూసి కొద్ది సేపు మాత్రమే ఆ కార్యక్రమంలో ఉన్నారు. ప్రధాన నిశ్చితార్ధ వేడుక వేదిక మీద ఆయన ప్రజెన్స్ రెండంటే రెండు నిముషాలు మాత్రమే ఉందంటే కుటుంబ సభ్యులు ఆయనను ఎంత దూరంగా పెడుతున్నారో అవగతమౌతుంది. ఆ కార్యక్రమంలో ఉన్నంత సేపూ పలకరించే వారు లేక  కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో  జగన్ ఇబ్బందిగా గడపడం స్పష్టంగా కనిపించింది.