జగన్ మామ కౌగిలిలో అల్లుడు.. టైం 2 నిముషాల ఒక సెకన్! | jagan allot 2minutes one second| nephew| engagement| security| relatives| face
posted on Jan 19, 2024 10:24AM
వైఎస్ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ జగనన్న అని చెప్పుకుంటారు. అవ్వాతాతలకు మనవడినని చాటుకుంటారు. ఇక పిల్లలకు దేవుడిచ్చిన మేనమానని ఘనంగా ప్రకటించుకుంటారు. అయితే సొంత తల్లి, చెల్లి, మేనల్లుడికి మాత్రం ఆయన ఏమీ కారు.
అందుకే సొంత మేనల్లుడి నిశ్చితార్ధం కార్యక్రమానికి మాత్రం ఆయన మొక్కుబడిగా హాజరై, హడావుడిగా ఆశీర్వదించేసి అంతకంటే హడావుడిగా అక్కడ నుంచి జారుకున్నారు.
ఆయన అక్కడ గడిపిన అతి స్వల్ప సమయంలో కూడా ఎవరూ ఆయన వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేయలేదు సరికదా.. ఎందుకు వచ్చారురా భగవంతుడా అన్నట్లు మొక్కుపడి పలకరింపులు, షేక్ హ్యాండ్ లతో సరిపెట్టేశారు. చివరికి సొంత చెల్లి కూడా సాధ్యమైనంత వరకూ అన్నకూ దూరం దూరంగా మెసిలింది. సతీసమేతంగా వచ్చిన జగన్ కు అక్కడ జరిగిన మర్యాద అది. ఇక జగన్ సతీమణి భారతికి అయితే ఆ మాత్రం పలకరింపులు కూడా దక్కలేదు. ఆ కార్యక్రమానికి హాజరైన మాత్రమే తెలిసిన ఈ తతంగాన్ని సీఎం జగన్ కార్యాలయం అదే ఏపీ సీఎంవో ఓ వీడియో ద్వారా అందరికీ తెలియజేసింది. ఆ వీడియో చూసిన నెటిజనులు తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఏపీలో పిల్లలందరికీ దేవుడిచ్చిన మేనమామ అయిన జగన్ సొంత మేనల్లుడి నిశ్చితార్ధంలో ముచ్చటగా మూడు నిమిషాలు కూడా ఉండలేదని.. అలా ఉండలేని విధంగా ఆయనంతట ఆయనే కుటుంబాన్ని దూరం చేసుకున్నారని వ్యాఖ్యానిస్తే పోస్టులు పెడుతున్నారు. కోట్లాదిమంది అక్కాచెల్లెమ్మలకు దేవుడిచ్చినఅన్నయ్య అయిన జగన్.. సొంత చెల్లి ఇంట్లో జరిగిన తొలి శుభకార్యానికి అలా అనుకోని అతిథిలా వచ్చి వెళ్లిపోవడమేమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు సెటైర్లు కూడా పేలుస్తున్నారు. కుటుంబాల్లో కలహాలు.. గొడవలు కామనే. అయితే శుభకార్యాల సందర్భాల్లో వాటిని పక్కనపెట్టి, కనీసం అప్పటివరకైనా కలసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనీసం కలసి ఉన్నట్లు నటిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. చూసేదే!
కానీ మేనల్లుడి నిశ్చితార్ధ వేడుకలో మాత్రం జగన లో ఆ కలివిడి తనం భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. అలాగే అన్న వచ్చాడన్న ఆనందం షర్మిల దంపతుల ముఖంలోనూ కనిపించలేదు. అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్‌కు, షర్మిల దంపతులకు మధ్య గొడవలు-ఆస్తి విబేధాలున్నాయన్న వార్త ..చాలాకాలం నుంచి ప్రచారంలో ఉంది. అయితే చెల్లి కుటుంబంలోజరిగే తొలి శుభకార్యం కాబట్టి.. జగన్ మేనమామ పాత్ర పోషించి, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు ప్రయత్నిస్తారని చాలామంది భావించారు.
పైగా ఏపీ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ తరువాత, షర్మిలతో తనకు ఉన్నవి రాజకీయ విభేదాలే తప్ప మరేమీ కాదని ప్రజలకు తెలిసేలా వ్యవహరించడం జగన్ కు అవసరం. జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి.. తమ మధ్య ఉన్నవి కేవలం రాజకీయ విభేదాలే కావనీ, అంతకు మించి అని చెప్పకనే చెప్పేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ అలా నేరుగా వేదిక వద్దకు రావడం.. మేనల్లుడిని కౌగిలించుకుని, కోడలిని ఆశీర్వదించడం… షర్మిల వియ్యంకుడు-వియ్యపురాలికి నమస్కరించడం… భార్య భారతిని దగ్గరకు పిలిచి ఫొటోలు దిగడం… ఆ సమయంలో చెల్లి షర్మిల-బావ బ్రదర్ అనిల్‌ను దగ్గరకు పిలిచినా రాకుండా, వారిద్దరూ దూరంగానే ఉండి ఫొటోలు దిగడం.. వెళ్లేముందు అమ్మ విజయలక్ష్మితో కొన్ని సెకన్లుమాట్లాడటం..వెంటనే అందరికీ నమస్కరిస్తూ భార్య భారతితో, అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగిపోయింది. ఇదంతా కేవలం రెండు నిమిషాల ఒక్క సెకన్ మాత్రమేనంటూ నెటిజనులు లెక్కగట్టి మరీ చెబుతున్నారు.
అంతే కాదు నిశ్చితార్థ వేదికపై కుటుంబ సభ్యుల మధ్య సెక్యూరిటీ తో జగన్ కనిపించడంపై కూడా నెటిజనులు ప్రశ్రిస్తున్నారు. జగన్ బయటకు వెళితే జనం ఎక్కడ నిరసనలు తెలుపుతారో, నిలదీస్తారో అన్న భయంతో రక్షణ, తాను ఎవరికీ కనిపించకుండా రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టడం వరకూ ఓకే. కానీ సొంత చెల్లి ఇంట్లో జరిగే శుభకార్యంలోనూ, సెక్యూరిటీ హడావిడి ఏంటి? ఎందుకు? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. మొత్తంగా షర్మిల కుమారుడి నిశ్చితార్ధ వేడుక జగన్ కు వ్యక్తిగతంగానే కాకుండా, రాజకీయంగా కూడా ఇబ్బంది కలిగించిందని, ఇరుకున పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది.