Leading News Portal in Telugu

రాజారెడ్డి ఎంగేజ్మెంట్.. జగన్ షర్మిల విభేదాలపై మరో సారి రచ్చరచ్చ! | rajareddy engagement| jagan| sharmila| differences| open


posted on Jan 20, 2024 8:35AM

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా ఎందరో అతిధులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఎంతమంది వచ్చినా.. ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిశ్చతార్ద వేడుకకు హాజరవడం మాత్రం హాట్ టాపిక్ అయింది. అందరిలాగానే జగన్ కూడా సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను ఆలింగనం చేసుకొని జగన్ చిరునవ్వులు చిందించారు. అలాగే ఈ సందర్భంగా కాబోయే జంటకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతా బాగానే ఉంది కాదా మరి రెండు రోజులుగా ఈ వేడుకకు జగన్ వెళ్లడం ఎందుకు ఇంతలా రచ్చ అవుతుందన్నది కూడా అందరికీ తెలిసిందే. సోదరి షర్మిలతో జగన్ విబేధాలు, అగాధాలు అన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే కాగా.. ఈ నిశ్చతార్ధ వేడుకలో జగన్ ప్రతి కదలిక ఆసక్తికరంగానే సాగింది.

జగన్ ఒక్కగానొక్క సొంత మేనల్లుడి నిశ్చతార్ద వేడుకలో పట్టుమని మూడు నిముషాలు కూడా ఉండలేకపోయారు. జగన్ కారు దిగి వేదికపైకి వెళ్లడం.. తల్లి, సోదరిని ఆలింగనం చేసుకోవడం, కాబోయే వధూవరులను పలకరించి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం, ఒక ఫోటోకి ఫోజివ్వడం.. కారు ఎక్కేసి అక్కడ నుండి వెళ్లిపోవడం ఇదే జరిగింది. దీంతో జగన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తన పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తమ్ముడి పెళ్లికి ఐదు గంటలు కేటాయించిన జగన్.. సొంత మేనల్లుడు పెళ్లికి ఐదు నిముషాలు కేటాయించలేకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ను మొక్కుబడిగా పలకరించిన షర్మిల, కనీసం ఆ ఆలింగనం ఫోటోలకు కూడా దొరకని విధంగా కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా జగన్ తనకు గుర్తుగా కాబోయే వధూవరులతో కుటుంబం అందరూ కలిసి ఫొటో దిగేందుకు ప్రయత్నించగా షర్మిల అందుకు ఇష్టపడలేదు. జగన్ ఫోటో విషయం చెప్పినా షర్మిల పట్టించుకోనట్లు ఉన్నారు. అయితే, చివరిగా తల్లి విజయమ్మ ప్రయత్నంతో షర్మిల ఫోటోకి ముందుకొచ్చినా.. అయిష్టంగానే జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచున్నారు.

ఈ నిశ్చతార్ద వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పుడు వార్ పీక్స్ లో ఉంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగా.. రానున్న ఎన్నికలలో జగన్ ఓటమికి పనిచేయడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. మరి అన్నా చెల్లెమ్మల మధ్య ఇంత వైరం ఉన్నప్పుడు అసలు వైఎస్ షర్మిల జగన్ ను ఆహ్వానించడం ఎందుకు?.. పోనీ షర్మిల ఆహ్వానించినా చుట్టపు చూపుగా జగన్ రావడం ఎందుకు అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఈ వేడుకకు వచ్చేందుకు జగన్ తన షర్ట్ ధరించిన సమయం కూడా ఈ వేడుకలో లేరు. మరి అలాంటపుడు అంత మొహమాటంగా రావడం ఎందుకు జగన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోనీ వచ్చినందుకు కనీసం అర్ధగంట సమయం కేటాయించి బంధువులు, మిత్రులను పలకరించి కాస్త సందడి చేసి ఉంటే అది ఎంతో గౌరవంగా ఉండేది.

సోదరుడిపై షర్మిల ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తనను నమ్మించి మోసగించాడని షర్మిల బలంగా నమ్ముతున్నారు. అందుకే అన్నపై సూటిగా బాణం ఎక్కుపెట్టారు. మరి అలాంటపుడు ఇంటికి వెళ్లి మరీ సోదరుడిని నిశ్చతార్ధ వేడుకకు ఆహ్వానించడం ఎందుకు? పోనీ ఆహ్వానించారు.. సోదరుడు కూడా వేడుకకు వచ్చారు. కానీ, తీరా వేదికపై ఎడమొహం పెడమొహం. మరి ఈ తప్పు ఎవరిది? నేచురాలిటీకి దగ్గరగా ఉండే తమిళ సినిమాలో కూడా ఈ వేడుక వేదిక మీద మనుషుల నటన చూసి ఉండరు. ఒకవేళ సినిమాలలోనే కాదు ఇలాంటి వేడుకలలో మనుషుల నటనకి కూడా అవార్డులు వస్తాయంటే.. రాజారెడ్డి-ప్రియాల నిశ్చతార్ద వేడుకలలో వైఎస్ ఫ్యామిలీ సభ్యుల నటనకి ఆస్కారుల పంట పండడం ఖాయం. ఆ స్థాయిలో నటించారు ఒక్కొక్కరు. మొత్తంగా ఈ నిశ్చతార్ద వేడుక వైఎస్ ఫ్యామిలీని మరోసారి సోషల్ మీడియాలో మోత పుట్టించేస్తుంది.