కమలాపురంలో బాబు సభకు జన ప్రభంజనం | babu meeting in kamalapuram success| jagan| rule| anarchy| people| trouble| employment| farmers| irrigation
posted on Jan 20, 2024 11:32AM
ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. రా కదలిరా అని తాను పిలుపునిస్తే కమలాపురం జనం వెల్లువలా కదిలారని చెప్పారు. ఇక కడపలో అయితే గడపగడపా జగన్పై యుద్ధానికి రెడీ అంటోందని చెప్పారు. రాష్ట్రంలో యువత, యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సహకారంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.
గత ఎన్నికలలో కడప జిల్లాలలోని అన్ని స్థానాలలోనూ గెలిచిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడపను కడనే ఉంచేసింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. తాగునీరు, సాగునీరు ఊసే లేదు. రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి. జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత సొంత జిల్లాలో జగన్ కు తప్ప మరెవరికీ సంతోషం లేదు. జిల్లాలో బాగుపడిన వారెవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. జగన్ రెడ్డి మాటలు కోటలు దాటాయిగానీ, చేతలు గడప దాటలేదు. సొంత నియోజకవర్గం పులివెందులలోనే పరదాలు, సెక్యూరిటీ లేకుండా కాలు కదపలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు.
వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్ గెలిచే పరిస్థితి కూడా లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జనం, రైతులు అల్లాడుతుంటే జగన్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదు సరి కదా కరువు మండలాల ప్రకటన గురించి అధికారులు ప్రస్తావిస్తే నా సొంత జిల్లాలో కరువా అంటూ కసురుకున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేశామని ఇప్పడు జనం పశ్చాత్తాపపడుతున్నారు. అంటూ చంద్రబాబు చెప్పిన ప్రతి మాటకూ జనం చ ప్పట్లతో మద్దతు తెలిపారు. చంద్రబాబు తన ప్రసంగంలో హు కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తే జనం నుంచి జగన్ జగన్ అంటూ బదులొచ్చింది.
వివేకా హత్య కేసులో మలుపులు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపించేలా ఉన్నాయి. వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సరే గత ఎన్నికల ప్రచారంలో తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ సానుభూతి సంపాదించి గెలిచిన జగన్ రెడ్డికి ఇప్పుడు వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టుకి వెళ్లిందెవరు, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నదెవరు జగన్ కదా అని చంద్రబాబు అన్నారు.
అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్ ఆర్దర్ తెచ్చారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి? అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
జగన్ హయంలో నిత్యావసర ధరలన్నీ పెరిగాయి. అదే తెలుగుదేశం పాలనలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం.
తెలుగుదేశం హయాంలో ఉన్న పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ ఇప్పుడు ఏమయ్యాయి. తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. ఇప్పుడు ఇస్తున్నారా? అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే జనం లేదు లేదు అంటూ ఎలుగెత్తారు. జగన్ రెడ్డిది బటన్ నొక్కుడు కాదు, బటన్ బొక్కుడు అంటూ చంద్రబాబు విమర్శిస్తే జనం తప్పట్లతో ఔనన్నారు.
మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సొంత బొక్కసం నింపుకుంటున్నారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ ఇలా అన్నిటి రేట్లు పెంచేయడంతో పాటు ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను వేధించుకు తింటున్నారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు కురిపించారు.
సీమకు జగన్ చేసిందేమీ లేదనీ, కడప స్టీల్ ఫాక్టరీకి రెండు సార్లు రిబ్బన్ కట్ రిబ్బన్ కట్ చేయడం రంగులు వేసుకోవటం తప్ప అని ఎద్దేవా చేశారు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసి ప్రాజెక్టులను పరిగెత్తించాం. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా అని బాబు నిలదీశారు. తెలుగుదేశం హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. దాని వల్ల అన్ని కాలువల్లో నీళ్లొచ్చాయి. కానీ ఇప్పుడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయంటూ చంద్రబాబు జగన్ పాలనను దుయ్యబట్టారు.