posted on Jan 20, 2024 2:52PM
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ తరపున ఎలిజా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
వైసీపీలో ఇంఛార్జిల మార్పులు చేర్పులు ఆ పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయి. మార్పుల పేరుతో సీఎం జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. కొందరికి స్థానచలనం చేశారు. మరికొందరిని ఎంపీలుగా బరిలోకి దింపుతున్నారు. ఈ పరిణామాలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టికెట్ రాని నేతలు, ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని వారు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఎమ్మెల్యే అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెత్తందారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. తనకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. తనకు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ లకు మధ్య విభేదాలున్నాయని, దానిని సాకుగా చూపి కొందరు తనపై అధినాయకత్వానికి తప్పుడు సమాచారాన్ని అందించారన్నారు. తనపై పెద్దయెత్తున కుట్ర జరిగిందని అన్నారు. సర్వే నివేదికలను…. సర్వే నివేదికలను కూడా పక్కన పెట్టి తప్పుడు నివేదికలు తయారుచేసి అధినాయకత్వానికి అందించారని ఎలీజా ఆరోపించారు. తాను ఐఆర్ఎస్ అధికారికా పనిచేస్తూ సర్వీసు మూడేళ్లున్నప్పటికీ దానిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అధినాయకత్వం ఈ కుట్రలను గమనించాలని ఎలీజా కోరారు. లేకపోతే పార్టీఇక్కడ ఇబ్బందుల్లో పడుతుందని ఆయన హెచ్చరించారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే టిడిపి ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. చర్చలు ఫలిస్తే టిడిపి తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం.