సానియాకు విడాకులు.. షోయెబ్ మాలిక్ రెండో వివాహం | shohab malik second marriage with pak actor| saniamirja
posted on Jan 20, 2024 12:51PM
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయెబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పాకిస్థాన్ సినీ నటి సనా జావేద్ తో తన వివాహం జరిగిందంటూ అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. గత కొన్నేళ్లుగా షోయెబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకూ ఆ వార్తలపై అటు సానియామీర్జా కానీ, ఇటు షోయెబ్ మాలిక్ కానీ స్పందించలేదు. ఇప్పుడు తన రెండో వివాహం గురించి షోయెబ్ మాలిక్ స్వయంగా వెల్లడించడంతో వారిరువురి విడాకులు వాస్తవమన్న విషయం తేటతెల్లమైంది.
కాగా సానియా మీర్జా కూడా షోయెబ్, తాను విడిపోతున్నామన్న సంకేతం ఇచ్చేలా రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో సానియా వివాహం, విడాకులు రెండూ కఠినమైనవేనని పేర్కొన్నారు. షాయెబ్, సానియా మీర్జా పెళ్లి తరువాత దుబాయ్ లో నివాసం ఉన్నారు. సానియామీర్జా టెన్నిస్ లో భారత్ కు, షోయెబ్ క్రికెట్ లో పాకిస్థాన్ కు ప్రాతినిథ్యం వహించారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కొద్ది రోజుల కిందట సానియా మీర్జా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే షోయెబ్ కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం షోయెబ్ మాలిక్ రెండో పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.