చక్రం తిప్పింది కేవీపీయే.. షర్మిల ఎంట్రీతో జగన్ కు శంకరగిరి మాన్యాలే! | kvp behind sharmila| ap| congress| chief| ycp| empty| tsr
posted on Jan 21, 2024 11:59AM
కేవీపీ రామచందర్ రావు ను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెబుతుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రాజకీయంగా ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ కు ఏపీలో పూర్వ వైభవం తీసుకురావడానికి తెరవెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారని తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధమౌతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే షర్మిలకు రూట్ క్లియర్ చేస్తూ రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు కేవీపి రామచందర్ రావుకు సన్నిహితుడు. అసలు గిడుగు రుద్రరాజు రాజకీయాలలోకి వచ్చిందే కేవీపీ రామచంద్రరావు ద్వారా. ఆయన ఆశీస్సులతోనే గిడుగు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ అయ్యారు.
ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టారు. షర్మిల ఏపీ సీఎం సోదరి మాత్రమే కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ కూడా. ఆ షర్మిలకు మార్గం సుగమం చేయడానికే పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం (జనవరి 21) బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శనివారం (జనవరి 20) షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ కు వెళ్లిన ఆమెతో కేవీపి రామచందర్ రావు కూడా ఉన్నారు. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవసరమైన వ్యూహరచన అంతా కేవీపీదేనని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అన్నీ కేవీపీ చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరిపోస్తారా, పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తారా అన్నది పక్కన పెడితే.. పిసిసి అధ్యక్షురాలిగా పార్టీలో ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని కొనసాగిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోవడానికి ముఖ్యకారణం వైఎస్ జగన్. విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోగానే.. పార్టీలోని వైఎస్ అనుచరులు అంతా ఆయన వెంట పార్టీని వీడారు. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఆయన వెనుకనే నడిచేది. కొద్ది మంది ఆయనతో విభేదించినా, వారి గొంతు వినిపించే పరిస్థితి కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉండేది కాదు. పార్టీలోని తన వ్యతిరేకులందరినీ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు క్రియా రహితంగా చేసేశారు. ఆ కారణంగానే వైఎస్ జగన్ వైసీపీ అంటూ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయన వెంట అప్పటి వరకూ కాంగ్రెస్ లో క్రియా శీలంగా ఉన్న నేతలంతా వెళ్లిపోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు మిగిలినా వారు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారిపోయింది. మిగిలిపోయింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గత పదేళ్లుగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఎంత కారణమో, వైఎస్ జగన్ కూడా అంతే కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే జగన్ తన పాలనలో తనను నమ్మి వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అలాగే ప్రజాదరణనూ కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఉనికి మాత్రంగా మారిపోవడానికి కారణమైన జగన్ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ లెగసీనే నమ్ముకుంది. అందుకే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ వ్యూహం ఇంత పక్కాగా, పకడ్బందీగా, సజావుగా అమలు కావడంలో తెరవెనుక చక్రం తిప్పింది వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సరే కేవీపీ వ్యూహం ఫలించి ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. అందుకున్నారు సరే.. సొంత అన్న జగన్ పార్టీని ఆమె ఏ మేరకు దెబ్బ తీస్తారు. వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతలలో ఎంత మంది షర్మిల కారణంగా సొంత గూటికి చేరుకుంటారు. ఆమె ప్రభావం ఏపి రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయతే విశ్లేషకులు మాత్రం షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు దాదాపు మృగ్యం అనే అంటున్నారు. షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడంతోనే వైఎస్ రాజకీయవారసురాలు షర్మిల మాత్రమేనన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు. ఇక షర్మిల కారణంగా రానున్న ఎన్నికలపై ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల మేరకు వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉంటే చీలిపోయేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. దాని వల్ల లబ్ధి పొందేది అధికార పార్టీయే. కానీ షర్మిల ఎంట్రీతో ఏపీలో మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటులో భారీ చీలిక వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జగన్ పార్టీని ఓటమికి మరింత చేరువ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం కారణమౌతుందని అంటున్నారు.