సందేహం లేదు.. షర్మిల టార్గెట్ జగనే! | no doubt sharmila target jagan| pcc| chief| first| speech| clarify| ycp
posted on Jan 22, 2024 5:34AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన సోదరుడు వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న నిన్న మొన్నటి దాకా అందరిలోనూ మెదులుతూ ఉన్న ప్రశ్న. అయితే ఇలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారో లేదో అలా అటువంటి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేశారు షర్మిల. ఇక ఆమె వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నే తలెత్తని విధంగా అన్నపై డైరెక్ట్ అటాకేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా తన తొలి ప్రసంగంతోనే తేల్చి చెప్పాశారు. ఆదివారం (జనవరి 21)న ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన షర్మిల జగన్ పై డైరెక్ట్ అటాక్ కు సిద్ధ పడ్డారని, అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి శంఖారావం పూరించారని ఆమె తొలి ప్రసంగంతోనే చాటారు. తనంటే భయపడేవారే ఎక్కువగా తనపై విమర్శలు చేస్తారనీ, తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పడం ద్వారా షర్మిల జగన్ సర్కార్ తన ఎంట్రీతో భయపడుతోందని స్పష్టం చేశారు.
వైసిపి హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని విమర్శించారు. జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో మూడు మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని, జనం మీద మోయలేనంతగా పన్నుల భారం మోపారని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు, పోలవరం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. దళితులపై దాడులు పెచ్చరిల్లాయి. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాల దోపిడీ స్వైరవిహారం చేస్తోంది. ఇక ప్రశ్నించే వారిపై వేధింపులు, గొంతెత్తితే కేసులు అంటూ షర్మిల వైసీపీ సర్కార్, ఏపీ సీఎం జగన్ పై సూటిగా విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేసిన జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఆ విషయం ఎత్తలేదని గుర్తు చేశారు. స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, మూడు రాజధానులన్న జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. .జగన్ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్ హింసాకాండ మీద మాట్లాడలేదని విమర్శించారు.