జగన్ కు షర్మిల వార్నింగ్.. ఓటమికి రెడీ అయిపోవాలని పరోక్ష హెచ్చరిక | sharmila warning to jagan| caution| ready| for| defeat| congress| bjp
posted on Jan 22, 2024 5:04AM
ఆంధ్రప్రదేశ్ పిసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ కు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ఓటమిని ప్రస్తావిస్తూ, తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించానని చెప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దింపిందని షర్మిల చెప్పడాన్ని బట్టి ఏపిలో కూడా వైఎస్ జగన్‌ను అధికారం నుంచి దింపుతానని, తన అజెండా అదేనని ఆమె పరోక్షంగా హెచ్చరించారు.
తెలంగాణ తన మెట్టినిల్లనీ, ఏపీ తన పుట్టిల్లనీ చెబుతూ తన లక్ష్యం, తన ధ్యేయం తెలుగు ప్రజలు బాగుండాలన్నదేనని చాటారు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరినట్లు క్లియర్ గా చెప్పడం ద్వారా ఏపీలో జగన్ హయాంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చాటారు. ఆ పరిస్థితిని చక్కదిద్ది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే తాను కాంగ్రెస్ లో చేరి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినట్లు షర్మిల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని చెప్పడం ద్వారా సోదరుడు అన్న ఓటమే లక్ష్యమని చాటారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు, తాను ఈ నెల 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు జిల్లాల్లో చేరికలు ఉంటాయని చెప్పారు. 24 నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.
బిజెపిపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ సంఘటలను ప్రస్తావిస్తూ అటువంటి బిజెపి దేశానికి అవసరం లేదని చెప్పారు. పోలవరం, అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా అన్ని విషయాల్లో బిజెపి ఏపీకి అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. వైసిపి, టిడిపి రెండు కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీలు కూడా బిజేపి వాళ్లేనని ఆమె వ్యాఖ్యానించారు.
తాను ఎవరూ వదిలిన బాణం కాదని, మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని షర్మిల అన్నారు.తన వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని ఆమె అన్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని వైఎస్ షర్మిల అన్నారు.