ఆ సెంటిమెంట్ ప్రకారం జగన్ ఓటమి ఖాయమే!? | sharmila sentiment send jagan danger bells| ycp| defeat| opposition| power| political
posted on Jan 22, 2024 8:53AM
తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతున్నప్పటికీ, ఆమె పొలిటికల్ ఎంట్రీ మాత్రం జగనన్న వదిలిన బాణంగానే ఆరంభమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలా జగనన్న వదిలిన బాణం.. చాలా దూరం ప్రయాణించింది. లక్ష్యాలను మార్చుకుంది. ఇప్పుడు ఎవరు వదిలారో వారే టార్గెట్ గా రెట్టించిన స్పీడ్ తో రివర్స్ అయ్యింది, జగనన్న తన చెల్లులు షర్మిల అనే బాణాన్ని ఏ లక్ష్యంతో వదిలారో.. ఆ లక్ష్యం చేరుకుందో లేదో తెలియదు కానీ ఇప్పడు మాత్రం రివర్స్ అయ్యింది. నేరుగా జగనన్న అధికారాన్నే గురిపెట్టింది. ఔను షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఆమె తన టార్గెట్ ఏమిటి? ఎవరి ఆశయాన్ని సాకారం చేయడం కోసం తాను ఏపీలో ఎంట్రీ ఇచ్చారు? అన్నది విస్పష్టంగా చెప్పేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని సాధించేం దుకు ఏపీలో అధికారాన్ని కాంగ్రెస్ కు అందించేందుకు తాను రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టానని షర్మిల సందేహాలకు అతీతంగా.. నేరుగా జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యమని కుండబద్దలు కొట్టేశారు. అంటే జగనన్న వదిలిన బాణంగా తన ప్రయాణాన్ని ముగించి.. ఇప్పుడు తనను సంధించిన వారిపైకే రివర్స్ అయ్యిందని తేటతెల్లమైపోయింది.
సినిమా రంగం తరువాత సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయ్యే రంగమేదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగం కంటే రాజకీయ రంగంలోనే సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఔను సినిమాలలో సక్సెస్ కాంబినేషన్ నే దర్శకులు, నిర్మాతలూ రిపీట్ చేస్తుంటారు. తమ సినిమా కథాబలం మీద ఎంత నమ్మకం ఉంచుతారో సక్సెస్ కాంబినేషన్ అన్న సెంటిమెంటును అంత కంటే ఎక్కువగా నమ్ముతారు. అదే విధంగా రాజకీయాలలో కూడా సెంటిమెంట్ కు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఇప్పుడు అదే సెంటిమెంట్ కారణంగా షర్మిల ఏపీ పాలిటిక్స్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.
ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే షర్మిల ఎంట్రీ తో జగన్ ఎగ్జిట్ ఖాయమైపోయిందనే భావన పోలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతోంది. ఆమె తొలి సారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. షర్మిల తన అన్న జగన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలలో షర్మిల అధికార తెలుగుదేశం పార్టీ పరాజయం కోసం అన్న జగన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఆ తరువాత షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. నేరుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ పోటీలో లేదు. కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి వైదొలగింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది.ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే 2019 ఎన్నికలలో ఏపీలో ఆమె ప్రచారం అధికార పక్షాన్ని గద్దె దించి ప్రతిపక్షాన్ని అధికారంలోకి తీసుకువచ్చింది. 2023 ఎన్నికలలో తెలంగాణలోనూ అదే రిపీట్ అయ్యింది. దీంతో షర్మిల అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేస్తే అధికార పార్టీకి ఓటమి తప్పదన్న ఒక సెంటిమెంట్ బలంగా రాజకీయ వర్గాలలో ఏర్పడింది. ఆమె ఏ పార్టీ తరఫున నిలబడ్డారో ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉంటే అధికారం చేజిక్కించుకుంటుంది. అంటే షర్మిల ప్రచారం అధికార పార్టీని గద్దె దించి ప్రతిపక్షాన్ని అధికార పీఠం ఎక్కిస్తుందన్న సెంటిమెంట్ రాజకీయపార్టీలలోనే కాదు, ప్రజలలో కూడా కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే ఏపీ ఎన్నికలలో షర్మిల కాంగ్రెస్ తరఫున నిలబడి ప్రచారం చేస్తుండటం అధికారంలో ఉన్న జగన్ పార్టీకి ఓటమిని ఖరారు చేయడమేనన్ననమ్మకం వైసీపీలో రోజు రోజుకూ బలపడుతోంది. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం, నమ్మకం ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఇక 2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి కావడానికి తన శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు అదే జగన్ ను గద్దె దించడానికి అంత కంటే ఎక్కువగా కష్టపడేందుకు రెడీ అయిపోయారు. సెంటిమెంటూ ఆమెకు అనుకూలంగానే ఉంది. సో వచ్చే ఎన్నికలలో జగన్ గద్దె దిగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే సెంటిమెంటు ప్రకారం తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమనీ అంటున్నారు.